చికిత్స పొందుతున్న మరో విద్యార్థి మృతి
సత్తుపల్లిటౌన్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న మరో విద్యార్థి ఆదివారం మృతి చెందాడు. ఈ నెల 3వ తేదీన ఐదుగురు విద్యార్థులు కలిసి పెనుబల్లి వైపు నుంచి సత్తుపల్లికి కారులో వస్తుండగా కిష్టారం అంబేడ్కర్‌నగర్‌కాలనీ వద్ద జాతీయ రహదారి మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొట్టడంతో ముగ్గురు విద్యార్థులు సిద్దేశి జాయ్, మర్సకట్ల శశిధర్, ఎస్‌కే సాజిద్ మృతిచెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అన్నపురెడ్డిపల్లికి చెందిన తలారి జయరాజు, శ్రావణి దంపతుల కుమారుడు అజయ్ (25) ఆదివారం మృతిచెందాడు. ఇతని తండ్రి జయరాజు అనారోగ్య కారణాలతో నాలుగేళ్ల క్రితం మరణించాడు. తల్లి శ్రావణి కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. మృతుడు డిగ్రీ పూర్తి చేయగా అతడికి దివ్యాంగురాలైన సోదరి ఉంది. సత్తుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చికిత్స పొందుతూ మహిళ..
బూర్గంపాడు: రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన బూర్గంపాడు మండలం అంజనాపురంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. అంజనాపురం గ్రామానికి చెందిన పింపి (48) శనివారం గ్రామంలో రోడ్డు దాటుతుండగా.. సారపాక వైపునకు వెళ్తున్న డీసీఎం వ్యాను ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో తీవ్రంగా గాయపడిన పింపిని స్థానికులు భద్రాచలం ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందింది. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు ఎస్సై నాగభిక్షం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
భారీగా గంజాయి పట్టివేత ?
భద్రాచలంఅర్బన్: భద్రాచలం పట్టణంలోని కూనవరం రోడ్డులో ఆదివారం ఓ ట్రాలీ ఆటోలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టణ పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. మోతుగూడెం నుంచి మహారాష్ట్రకు రోడ్డు మార్గాన తరలించే ప్రయత్నంలో భాగంగా భద్రాచలం మీదుగా వెళ్తున్న ఈ గంజాయిని పోలీసులు పట్టుకున్నట్లు తెలిసింది. కాగా, పట్టుబడిన గంజాయి దాదాపు 200 కేజీలకు పైగానే ఉంటుందని, ఈ గంజాయిని తరలిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.


