లేఖలేక రాస్తున్నా..
లెటర్ టు మై రోల్ మోడల్ థీమ్‌తో ‘ఢాయీ ఆఖర్’ విద్యార్థుల నుంచి విశేష స్పందన రేపటితో ముగియనున్న గడువు
స్పందన వస్తోంది.
మనసులోని భావాలకు అక్షర రూపమిస్తే అవతలివారి హృదయాలను తాకుతుంది. అందుకే చేతిరాత లేఖలు అందగానే ఆనందం వెల్లివిరుస్తుంది. ప్రజోపయోగ కార్యక్రమాలపై ఉన్నతాధికారుల మధ్య ఉత్తరప్రత్యుత్తరాలతో విషయ ప్రాధాన్యం పెరుగుతుంది. అయితే ఎస్‌ఎంఎస్‌లు, ఈ–మెయిల్, సోషల్ మీడియా విస్తరించిన తరుణంలో ఉత్తరాల సంస్కృతి కనుమరుగవుతోంది. ఆ మధుర భావనలు నవతరం కూడా ఆస్వాదించేలా తపాలా శాఖ ‘ఢాయీ ఆఖర్’ కార్యక్రమాన్ని చేపట్టింది. అన్నట్టు ఉత్తమ లేఖలకు నగదు బహుమతులు కూడా ప్రకటించింది.
కరకగూడెం: ఆధునిక కాలంలో ఈ–మెయిల్స్, సోషల్ మీడియా, సెల్ ఫోన్లు వచ్చాక ఉత్తరాలు రాయడం దాదాపుగా కనుమరుగైంది. ఈ నేపథ్యంలో తపాలా శాఖ ఉత్తరాలను గుర్తు చేసేందుకు ఢాయీ ఆఖర్ పేరుతో జాతీయస్థాయి లేఖల పోటీ నిర్వహిస్తోంది. యువతకు లేఖల సంస్కృతిని అలవర్చేందుకు ఈ కార్యక్రమం చేపట్టింది. ఉమ్మడి జిల్లాలోని పాఠశాలల్లో అవగాహనా కార్యక్రమాలు కూడా నిర్వహించింది. ‘లెటర్ టు మై రోల్ మోడల్’(నా ఆదర్శప్రాయులకు లేఖ) థీమ్‌తో పోటీలు నిర్వహిస్తోంది. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో ఒక స్థాయిలో ప్రభావం చూపిన ఆదర్శమూర్తులు ఉంటారు. వారు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఏదైనా రంగంలో గొప్ప విజయం సాధించిన వ్యక్తులై ఉండవచ్చు. రోల్ మోడల్‌కు తమ మనసులోని భావాలను, కృతజ్ఞతలను, స్ఫూర్తిని తెలియజేస్తూ చేతి రాతతో లేఖ రాయాలి. లేఖ ఇన్‌లాండ్ లెటర్‌లో 500 పదాల్లోపు ఉండేలా చూసుకోవాలి. కవరుపై వయసు రాసి, అందుకు సంబంధించిన ధ్రువీకరణపత్రం జత చేయాలి.
నగదు బహుమతులు
పోటీల్లో అన్ని వయసులవారూ పాల్గొనవచ్చు. తెలుగు, ఇంగ్లిష్, హిందీ సహా ఏ భాషలోనైనా లేఖ రాయవచ్చు. లేఖల పోటీ గత అక్టోబర్ 3న ప్రారంభంకాగా, ఈ నెల 8వ తేదీతో ముగియనుంది. లేఖలను సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్, ఖమ్మం డివిజన్, పిన్‌కోడ్–507003 లేదా చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్, తెలంగాణ సర్కిల్, హైదరాబాద్, పిన్‌కోడ్–500001 చిరునామాకు పంపాలి. సర్కిల్‌స్థాయిలో మొదటి బహుమతికి రూ.25 వేలు, ద్వితీయ బహుమతి రూ.10 వేలు, తృతీయ బహుమతి రూ.5వేలు, జాతీయ స్థాయిలో మొదటి బహుమతి రూ.50 వేలు, రెండో బహుమతి రూ.25 వేలు, మూడో బహుమతిగా రూ.10 వేలు అందజేస్తారు.
తపాలా శాఖ ఆధ్వర్యంలో ఉత్తరాల పోటీ
డిజిటల్ యుగం ఎంత ముందుకెళ్లినా లేఖ రాయడం అనేది భావాల్ని హృదయపూర్వకంగా వ్యక్తపరిచే అందమైన పద్ధతి. ఈ ఏడాది ‘లెటర్ టు మై రోల్ మోడల్’థీమ్‌కు విద్యార్థులు, యువత నుంచి స్పందన వస్తోంది. ఖమ్మం డివిజన్ పరిధిలోని అనేక పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. పిల్లలు ఆసక్తితో లేఖలను స్వయంగా రాసి పంపుతున్నారు. వచ్చే నెల 23న ఫలితాలు ప్రకటించి నగదు బహుమతులు అందిస్తాం.
–వీరభద్ర స్వామి, తపాలా శాఖ,
సూపరింటెండెంట్, ఖమ్మం
లేఖలేక రాస్తున్నా..
లేఖలేక రాస్తున్నా..
లేఖలేక రాస్తున్నా..


