చిన్నారులకూ ‘అపార్’
● ఈ ఏడాది నుంచి అంగన్‌వాడీ కేంద్రాల్లో అమలు
జిల్లాలో ఇప్పటివరకు 44.8 శాతం నమోదు
జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలతోపాటు దుమ్ముగూడెం ఐసీడీఎస్ ప్రాజెక్టులో కూడా చిన్నారులకు అపార్ నమోదు చేపడుతున్నాం. మిగిలిన చిన్నారులకు పూర్తి చేసేందుకు తల్లిదండ్రులు సహకరించాలి.
–జ్యోతి, సీడీపీవో, దుమ్ముగూడెం ప్రాజెక్టు
భద్రాచలంఅర్బన్: వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడీ నినాదంతో కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు అపార్ (ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) అమలు చేస్తోంది. ప్రతీ విద్యార్థికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయిస్తోంది. రెండేళ్ల నుంచి పాఠశాల స్థాయిలో విద్యార్థులకు అపార్ నమోదు ప్రక్రియ చేపడుతున్నారు. పాఠశాలస్థాయి నుంచి ఉన్నత విద్యను అభ్యసించేస్థాయి వరకు అన్నిరకాల సర్టిఫికెట్లను ఇందులో భద్రపరుచుకునే అవకాశం ఉంది. ఈ సంవత్సరం నుంచి అంగన్‌వాడీ కేంద్రాల్లో చేరిన విద్యార్థులకు కూడా అపార్ నమోదు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
కొనసాగుతున్న నమోదు ప్రక్రియ
జిల్లాలోని 2061 అంగన్వాడీ కేంద్రాల్లో నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఐదేళ్లలోపు చిన్నారులు 21,822 మంది ఉండగా, 11,153 మంది ఆధార్ కార్డులు కలిగి ఉన్నారు. వారిలో ఇప్పటి వరకు 9,777 మంది చిన్నారులకు 44.8 శాతం అపార్ నమోదు ప్రక్రియ పూర్తి చేసినట్లు ఐసీడీఎస్ అధికా రులు తెలిపారు. ఆధార్ కార్డు కలిగి ఉన్న 10,669 మంది చిన్నారులకు అపార్ నమోదు చేయాల్సి ఉందని ఐసీడీఎస్ అధికారులు పేర్కొంటున్నారు.
నమోదులో ఇబ్బందులు
అపార్ నమోదులో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు అంగన్‌వాడీ టీచర్లు, ఐసీడీఎస్ అధికారులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అంగన్‌వాడీ కేంద్రాల వద్ద నెట్వర్క్ సక్రమంగా రాకపోవడం, ఆధార్ కార్డులులేని వారికి అవి వచ్చే వరకు వేచి చూడాల్సి రావడం, గిరిజన ప్రాంతాల్లో చిన్నారులను సకాలంలో కేంద్రాలకు పంపించకపోవడ వంటి కారణాలతో అపార్ నమోదులో జాప్యం జరుగుతోందని పేర్కొంటున్నారు.
చిన్నారులకూ ‘అపార్’


