రెండెకరాల్లో పోడు నరికివేత
అశ్వారావుపేటరూరల్: అడవులను సంరక్షించాలని ప్రభుత్వాలు, ఫారెస్టు అధికారులు పదేపదే చెబుతున్నా కొందరు అక్రమార్కులు పోడు పేరుతో అటవీ వృక్షాలను నరికివేసి భూములను ఆక్రమిస్తున్నారు. తాజాగా అశ్వారావుపేట ఫారెస్టు రేంజ్ పరిధిలో అనంతారం సెక్షన్ చెన్నాపురం బీట్‌లోని గాండ్లగూడెం సమీపంలో ఓ వ్యక్తి పోడు పేరుతో చెట్లను నరికి వేసిన ఘటన శనివారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన ఓ గ్రామీణ వైద్యుడు కొందరు కూలీలతో తన పోడు వ్యవసాయ భూమి సమీపంలోనే ఉన్న అటవీ ప్రాంతంలో ఉన్న పెద్ద పెద్ద వృక్షాలను భారీస్థాయిలో నరికించాడు. దాదాపు రెండు ఎకరాల్లో ఉన్న మారుజాతి చెట్లను నరికి వేయడంతో గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కాగా, రెండెకరాల్లో భారీ వృక్షాలను నరికివేసినా స్థానికులు ఫిర్యాదు చేసేవరకు అటవీ శాఖ అధికారులు గమనించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నలుగురిపై కేసు నమోదు
గ్రామీణ వైద్యుడు కూలీలతో పోడు పేరుతో అడవి నరికివేసిన ఘటనపై శనివారం అశ్వారావుపేట ఫారెస్టు రేంజర్ మురళి కేసు నమోదు చేశారు. అడవి నరికివేస్తున్నారనే సమాచారం అందగా, సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి గొడ్లళ్లతో నరుకుతున్న ముగ్గురు కూలీలతోపాటు సదరు వ్యక్తిను అదుపులోకి తీసుకుని రేంజ్ ఆఫీసుకు తరలించారు. నలుగురిపై కేసు నమోదు చేసి, రూ.15,400 జరిమానా విధించినట్లు రేంజర్ తెలిపారు.


