మెగా జాబ్‌మేళాకు రెడీ
కేటీపీఎస్ విస్తరణ..
యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం
ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను మించి అప్పటి యువతకు ఉపాధి కల్పించిన నగరంగా కొత్తగూడెం పేరు తెచ్చుకుంది. 2000లలో ఎలక్ట్రానిక్స్, ఐటీ రంగం విస్తరించే వరకు తెలంగాణకు ప్రధాన ఉపాధి వనరు అందించే ప్రాంతంగా కొత్తగూడెం (సింగరేణి)కి పేరుండేది. గడిచిన రెండు దశాబ్దాలుగా ఇక్కడ ఆశించిన స్థాయిలో ఉపాధి లభించడం లేదు. ఓ వైపు సింగరేణి గనులు తగ్గిపోగా మరోవైపు కేటీపీఎస్‌లో పాత ప్లాంట్లు మూత పడ్డాయి. ఈ నేపథ్యంలో స్థానిక యువత కోసం ఈ నెల 16న కొత్తగూడెంలో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నారు. సుమారు 65 కంపెనీలు జాబ్‌మేళాలో పాల్గొంటుండగా, పదో తరగతి నుంచి డాక్టరేట్ వరకు వివిధ అర్హతలతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఇదే ఒరవడిలో రాబోయే రోజుల్లో జిల్లా కేంద్రమైన కొత్తగూడెం నగరాన్ని ఉపాధి వనరుల కేంద్రంగా మార్చేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
పీపీపీ మోడ్‌లో ఎన్‌ఎండీసీ
పాల్వంచలో ఎన్‌ఎండీసీ ఆధ్వర్యంలో నాలుగు వందల ఎకరాలకు పైగా స్థలం ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ రంగంలో ఏమైనా పరిశ్రమలు వస్తాయేమో అని ఎదురు చూశాం కానీ, దశాబ్దాలు గడిచినా ఎటువంటి పురోగతీ లేదు. అందుకే ఇక్కడున్న స్థలంలో ప్రభుత్వ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) మోడ్‌లో కొత్త పరిశ్రమలు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. త్వరలోనే కార్యాచరణ సిద్ధం అవుతుంది.
జూపార్క్ కోసం యత్నాలు
జిల్లాలో విస్తారంగా అడవులు, నదులు ఉన్నాయి. ఎకో టూరిజంలో జిల్లాకు అపార అవకాశాలున్నాయి. ఇల్లెందు క్రాస్‌రోడ్డులో హరిత హోటల్, కిన్నెరసానిలో ఎకో టూరిజం కాటేజీలు త్వరలో అందుబాటులోకి వస్తాయి. వీటితోపాటు కొత్తగూడెంలో జూపార్క్ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. జూపార్క్ ఏర్పాటయితే భద్రాచలం – కొత్తగూడెం – కిన్నెరసానిల మధ్య టూరిజం అభివృద్ధి చెందుతుంది.
సింగరేణి ఆధ్వర్యంలో..
సింగరేణి ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉంది. ఈ నగర అభివృద్ధి, ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించే లక్ష్యంతో కొత్తగా షాపింగ్ కాంప్లెక్స్, మల్టీప్లెక్స్‌లను సింగరేణి ఆధ్యర్యంలో నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం గోదావరిఖనిలో ఈ పనులకు అడుగులు పడ్డాయి. త్వరలోనే కొత్తగూడెంలోనూ ఈ తరహా పెట్టుబడులు సింగరేణి నుంచి వస్తాయి.
విద్యారంగంలో..
డాక్టర్ మన్మోహన్‌సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీలో పూర్తిస్థాయిలో అడ్మిషన్లు జరిగితే సుమారు మూడు వేల మంది విద్యార్థులు, మరో ఐదు వందల మంది వరకు అధ్యాపకులు, ఇతర స్టాఫ్ అందుబాటులోకి వస్తారు. అక్కడే మెడికల్ కాలేజీ క్యాంపస్ కూడా ఉంది. రాబోయే రోజుల్లో కొత్తగూడెం – పాల్వంచల నడుమ ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా జిల్లాలో ఉపాధి అవకాశాలు మెగురుపరుస్తాం.
కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రం (కేటీపీఎస్)లో ఓఅండ్‌ఎంకు చెందిన ఏ,బీ,సీ యూనిట్లు కూల్చివేయడంతో నాలుగు వందల ఎకరాల స్థలం అందుబాటులోకి వచ్చింది. దీంతో 800 మెగావాట్ల సామర్థ్యంతో కొత్త యూనిట్ నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. ఈ మేరకు సాధ్యాసాధ్యాలు పరిశీలించేందుకు ఇటీవల జెన్‌కో కన్సల్టెన్సీని కూడా నియమించింది. నివేదిక వచ్చాక ప్రభుత్వంతో మాట్లాడి కొత్త ప్లాంట్‌ను సాధిస్తాం. తద్వారా పాల్వంచకు పూర్వవైభవం తీసుకొస్తాం. త్వరలోనే సింగరేణి వీకే మెగా ఓపెన్‌కాస్ట్ గని కూడా ప్రారంభంకానుంది.
రేపు కొత్తగూడెంలో 65 కంపెనీలతో నిర్వహణ


