అటవీ భూములను సంరక్షించాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం)/చుంచుపల్లి: అటవీ భూముల సంరక్షణ అందరి బాధ్యత అని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా అటవీ సంరక్షణ కమిటీ సమావేశంలో మాట్లాడారు. అటవీ భూముల పరిరక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. గిరిజనులు పోడు నరకకుండా వారికి చేపల పెంపకం శిక్షణ, లైవ్లీహుడ్ షెడ్ల ఏర్పాటుతో జీవనోపాధి కల్పించాలని చెప్పారు. గొత్తికోయ గిరిజనులకు మౌలిక సౌకర్యాలు కల్పించాలని, యువతకు ఫర్నిచర్ తయారీలో శిక్షణ ఇవ్వాలని అన్నారు. ఇప్పటికే నరికిన పోడు ప్రదేశాల్లో వెదురు మొక్కలు నాటాలని సూచించారు. జీసీసీ ద్వారా అటవీ ఉత్పత్తుల మార్కెటింగ్ పెంచాలని, ఇప్పచెట్ల సర్వే నిర్వహించాలని ఆదేశించారు. తుమ్మల చెరువు, కిన్నెరసాని, ఇల్లెందు, రథంగుట్ట వంటి ప్రాంతాల్లో ట్రెక్కింగ్ కార్యక్రమాలు ప్రారంభించాలని, ముక్కోటి ఏకాదశి నాటికి ఐదు ట్రెక్కింగ్ మార్గాలను గుర్తించాలని అన్నారు. పర్యాటకాభివృద్ధికి కూడా కృషి చేయాలని సూచించారు. ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ పోడు నరికేవారిని గుర్తించేందుకు ప్రత్యేక పర్యవేక్షణ బృందాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణాగౌడ్, కొత్తగూడెం ఆర్డీవో మధు, విద్యుత్ శాఖ అధికారి మహేందర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, అటవీశాఖ అధికారులు, పోలీస్ శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు.
బాల్యవివాహాల రహిత జిల్లాగా మార్చాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాను బాల్యవివాహ రహితంగా మార్చేందుకు సమష్టి కృషి చేయాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ పిలుపునిచ్చారు. యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ సంస్థ ఆధ్వర్యంలో బాల్యవివాహాల నిర్మూలనకు చేపట్టిన వందరోజుల ప్రచార వాల్‌పోస్టర్‌ను శుక్రవారం కలెక్టర్ తన చాంబర్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, అన్నివర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. సంస్థ జిల్లా కోఆర్డినేటర్ వి.రాజేష్, టీం సభ్యులు మాన్‌సింగ్, జ్యోతి, మోహన్, మౌనిక తదితరులు పాల్గొన్నారు.
పుస్తక జ్ఞానాన్ని మించింది లేదు
కొత్తగూడెంఅర్బన్: ఇంటర్‌నెట్, వైఫైల కంటే పుస్తక జ్ఞానమే ముఖ్యమని, పుస్తక జ్ఞానాన్ని మించింది లేదని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమాన్ని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. నెహ్రూ, ఎస్‌ఆర్ రంగనాథన్‌ల చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి మాట్లాడారు. గ్రంథాలయ వారోత్సవాల్లో మొదటి రోజు చిన్నారులు ఆటపాటలతో అలరించారు. గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు, ఆఫీస్ ఇంచార్జ్ నవీన్ కుమార్, గ్రంథ పాలకురాలు జి మణిమృదుల, మధుబాబు, వాణి, జానీ పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి.పాటిల్


