మౌలిక సదుపాయాలు కల్పించాలి
పినపాక: ఆదివాసీ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, గ్రామాల్లో రహదారి, వైద్యం అందే విధంగా చూడాలని సెన్సెస్ డిప్యూటీ డైరెక్టర్ సుబ్బరాజు అన్నారు. మండల పరిధిలోని వలస ఆదివాసీ గ్రామమైన పిట్టతోగులో శుక్రవారం కేంద్ర బృందం పర్యటించింది. రహదారి సౌకర్యం లేకపోవడంతో సభ్యులు నడుచుకుంటూ గ్రామానికి వెళ్లి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి విద్యుత్ సౌకర్యం, విద్య లేకపోవడం వల్ల యువత వెనకబడుతోందని అన్నారు. అనంతరం ఆదివాసీ గ్రామాల సమస్యలపై తహసీల్దార్ గోపాలకృష్ణతో మాట్లాడారు. ఆదివాసీ గ్రామాలను కూడా కులగణన, ఇంటి గణన కార్యక్రమంలో చేర్చేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జ్ఞానశేఖర్, స్టాటిస్టికల్ ఆఫీసర్ సతీష్, కుమారి హిమ వర్షా, హరిత వినయ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.


