పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్‌కు పంచామృతంతో అభిషేకం పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమ పూజ, గణపతిహోమం నిర్వహించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శ్రీ అన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశ్వర స్వామికి లక్షబిల్వార్చన, పంచామృతాభిషేకం, ఆకాశదీపం, నివేదన, మంత్రపుష్పార్చన పూజలు నిర్వహించారు. కాగా ఏకాదశి సందర్భంగా శనివారం శ్రీ సత్యనారాయణవ్రత పూజలు నిర్వహించనున్నట్లు ఈఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు పాల్గొన్నారు.
నేడు మంత్రి లక్ష్మణ్ పర్యటన
భద్రాచలంటౌన్ : రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శనివారం భద్రాచలంలో పర్యటించనున్నట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన భవనంలో మధ్యాహ్నం జరిగే రాష్ట్రస్థాయి జన్ జాతీయ గౌరవ దివస్‌తో పాటు భగవాన్ బిర్సా ముండా జయంతి వేడుకలకు హాజరవుతారని వివరించారు. అనంతరం ఐటీడీఏ సమావేశ మందిరంలో సంక్షేమ పథకాల అమలుపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారని తెలిపారు.
ఉద్యాన పంటలు సాగు చేయాలి
అశ్వారావుపేటరూరల్: రైతులు ఇతర పంటలతోపాటు ఉద్యాన పంటలను సాగు చేసి ఆర్థికంగా బలోపేతం కావాలని అశ్వారావుపేట శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయకృష్ణ అన్నారు. శుక్రవారం మండలంలోని అచ్యుతాపురం గ్రామంలో మోజెర్ల ఉద్యాన కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో జరుగుతున్న హార్టికల్చర్ వర్క్ ఎక్సిపీరియన్స్ కార్యక్రమంలో భాగంగా రైతులకు అవగాహన సదస్సుతోపాటు ఉద్యాన పంటల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల ఆకృతులతో భూసార పరీక్షలు, జీవన ఎరువులు, హరిత గృహాలు, బహుళ అంతస్తుల పంటలు, తేనెటీగల పెంపకం, వర్మీ కంపోస్టు తయారీపై అవగాహన కల్పించారు. ఉద్యాన పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెలకువలపై ప్రధాన శాస్త్రవేత్త వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ భాస్కర్, ఉద్యాన విద్యార్థులు సాగర్, సత్య, అభినయ్, శివ, అజయ్, కృష్ణ కుమార్, ధర్మతేజ, సురేంద్ర, నగేష్, యశ్వంత్, వంశీ, గ్రామ రైతులు పాల్గొన్నారు.
బిర్సా ముండా జయంతిని విజయవంతం చేయాలి
ఐటీడీఏ పీఓ రాహుల్
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో శనివారం నిర్వహించే పీఎం ధర్తీ ఆభా, భగవాన్ బిర్సా ముండా జయంతి, జన్ జాతీయ గౌరవ దివస్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఆదేశించారు. ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన భవనంలో ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. ప్రధాని మోదీ వర్చువల్ విధానం ద్వారా ప్రసంగిస్తారని వెల్లడించారు. ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. అధికారులు డేవిడ్ రాజ్, రాంబాబు, సమ్మయ్య, అరుణకుమారి, హరీష్, అలివేలు మంగతాయారు, చైతన్య, ఉదయ్ కుమార్, ప్రభాకర్ రావు, హరికృష్ణ, ఆదినారాయణ పాల్గొన్నారు.
పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకం
పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకం


