గూడెంలో హాకీ మైదానం..
● లక్ష్మీదేవిపల్లిలో హాకీ గ్రౌండ్  ఏర్పాటుకు సన్నాహాలు ● నాలుగెకరాల స్థలం, రూ.1.38 లక్షల బడ్జెట్ కేటాయింపు ● రెండు నెలల్లో అందుబాటులోకి రానున్న క్రీడా మైదానం ● హర్షం వ్యక్తం చేస్తున్న  క్రీడా సంఘాలు, క్రీడాకారులు
కొత్తగూడెంటౌన్: జిల్లావ్యాప్తంగా హాకీ క్రీడాకారులు 200 మంది వరకు ఉన్నారు. వీరంతా ప్రాక్టీస్ చేసేందుకు ఎక్కడా సరైన మైదానం లేదు. పలుమార్లు క్రీడాకారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు ప్రత్యేకంగా హాకీ క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని ప్రజాప్రతినిధులకు, ఉన్నతాధికారులకు విన్నవించారు. దీంతో ప్రభుత్వం జిల్లా కేంద్రంలో హాకీ స్టేడియం ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. యువజన, క్రీడలశాఖ ఆధ్వర్యంలో హాకీ గ్రౌండ్ కోసం స్థల సేకరణ కూడా పూర్తయింది. రెండు నెలల లోపు గ్రౌండ్ అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత గ్రౌండ్‌ను స్టేడియంగా మార్పు చేయాలని, ఇందుకోసం సుమారు రూ.3 నుంచి 4 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అధికారులు భావిస్తున్నారు.
శ్రీరామచంద్ర డిగ్రీ కళాశాల వెనుక భాగంలో..
లక్ష్మీదేవిపల్లి మండలంలోని శ్రీరామచంద్ర డిగ్రీ కళాశాల వెనుక భాగంలో హాకీ గ్రౌండ్ నిర్మాణానికి నాలుగెకరాల స్థలం కేటాయించారు. గ్రౌండ్ పనులకు రూ.1,38,000 మంజూరు చేశారు. ఫారెస్టు పరిధిలో ఉన్న స్థలానికి అనుమతులు కూడా వచ్చాయని జిల్లా యువజన క్రీడలశాఖ అధికారి ఎం.పరంధామరెడ్డి తెలిపారు. కేటాయించిన స్థలంలోని చెట్లను తొలగించేందుకు వేలంపాట కూడా నిర్వహించారు. నాలుగు ఎకరాల్లో ఉన్న 78 చెట్లను తొలగించేందుకు బడ్జెట్‌లో రూ.39,000 ఖర్చు చేయనున్నారు. మైదానం చదును తదితర పనుల కోసం రూ.60 వేలు, రోలర్‌తో చదును చేసేందుకు రూ.15 వేలు, నైలాన్ నెట్‌లు, హాకీ స్టిక్స్, స్టాపింగ్ బాల్స్ కోసం రూ.16 వేలు, బోర్డు ఏర్పాటుకు రూ.8 వేలు ఖర్చు చేయాలని ప్రణాళిక రూపొందించారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
