ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి
పాల్వంచరూరల్: నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఫీజురీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని జిల్లా ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల సంఘం అధ్యక్షుడు తలశిల భరత్ కృష్ణ, కార్యదర్శి కె.నాగమణి కోరారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ సోమవారం జిల్లాలోని ప్రైవేట్ ఇంజనీరింగ్, ఫార్మసీ, డిగ్రీ, పీజీ, ఐటీఐ, బీఈడీ, డీఈడీ, నర్సింగ్ విద్యాసంస్థలను బంద్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చేవరకూ నిరవధిక బంద్‌ను పాటిస్తామని తెలిపారు. ప్రైవేట్ విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారని వివరించారు.
ఏఎంసీ అధికారుల తనిఖీలు
టేకులపల్లి: మండలంలో పత్తి చిల్లర కౌంటర్లలో సోమవారం ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ కమిటీ స్పెషల్ గ్రేడ్ కార్యదర్శి వి సుచిత్ర ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. గోలియాతండా, టేకులపల్లి, సుక్కాలబోడు, కోయగూడెం గ్రామాల్లో ఆరు కౌంటర్లను తనిఖీ చేశారు. రూ.15 వేలు మార్కెట్ ఫీజును వసూలు చేశారు. లైసెన్సులు తీసుకోవాలని నోటీసులు జారీ చేశారు.లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రేడ్–3 కార్యదర్శి ఇ.నరేష్‌కుమార్, సూపర్‌వైజర్ ఎన్.శ్రీనివాస్‌రావు, సిబ్బంది రంజిత్, మధు పాల్గొన్నారు.
చెక్ బౌన్స్ కేసులో
6 నెలల జైలు
మణుగూరు టౌన్: తీసుకున్న రుణం తిరిగి చెల్లించేందుకు ఇచ్చిన చెక్ బౌన్స్ అయిన కేసులో ముద్దాయిపై నేరం రుజువైనందున ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.8 లక్షల పరిహారం చెల్లించాలని మణుగూరు ప్రథమ శ్రేణి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కంబపు సూరిరెడ్డి శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని అశోక్‌నగర్‌కు చెందిన గారపాటి సత్యనారాయణ అదే ప్రాంతానికి చెంది మంచాల అంజయ్య వద్ద 2017లో రూ.8 లక్షల నగదు అప్పుగా తీసుకున్నారు. తీసుకున్న రుణం తిరిగి చెల్లించేందుకు ఆగస్టు 10న 2019న రూ. 7 లక్షలకు చెక్కు జారీ చేశారు. బ్యాంకులో సరిపడా నగదు లేకపోవడంతో చెక్కు బౌన్స్ అయింది. ముద్దాయికి నోటీస్ ఇవ్వగా సమాధానం ఇవ్వలేదు. దీంతో అంజయ్య మణుగూరు ప్రథమ శ్రేణి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించాడు. సాక్ష్యాధారాలను పరిశీలించిన మెజిస్ట్రేట్ పైవిధంగా శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. ఫిర్యాదుదారుని తరుఫున న్యాయవాదులు నగేశ్ కుమార్, మధుసూదన్, రమేశ్‌లు వాదించారు.
మహిళ అదృశ్యం
ఇల్లెందు: పట్టణంలోని ఇందిరా నగర్‌కు చెందిన 21 ఏళ్ల ఎన్. శృతి అదృశ్యమైనట్లు సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 1న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని, వెతికినా ఆచూకీ లభించలేదని ఆమె తండ్రి ఎన్.అబ్రహం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఎస్‌ఐ సమ్మిరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
							ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
