కార్యకర్తల కోసం ప్రాణాలిచ్చేందుకు సిద్ధం
● కాంగ్రెస్ శ్రేణులపై బీఆర్‌ఎస్ నేతల దాడికి ఖండన ● పినపాక ఎమ్మెల్యే  పాయం వెంకటేశ్వర్లు 
మణుగూరు టౌన్: పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలకు పార్టీపై అమితమైన అభిమానం ఉందని, అందుకే టికెట్ తెచ్చుకున్న వారికి గెలుపు లభిస్తుందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ఆక్రమించుకున్న కార్యాలయాన్ని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన కాంగ్రెస్ నాయకులపై బీఆర్‌ఎస్ కార్యకర్తలు దాడులకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. సోమవారం ప్రజాభవన్‌లో డీసీసీ అధ్యక్షుడు పొదెం వీరయ్య, వివాదంగా మారిన కార్యాలయం స్థల దాత కుమారుడు పిల్లారిశెట్టి హరిబాబుతో కలిసి ఆయన మాట్లాడారు. కార్యకర్తల కోసం ప్రాణాలిచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని అన్నారు. 1987లో పిల్లారిశెట్టి సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి స్థలం దానం చేశారని తెలిపారు. 2009లో అప్పటి మండల అధ్యక్షుడు భూమి పూజ చేయగా, 2010లో కార్యకర్తల కష్టంతో కార్యాలయం నిర్మాణం పూర్తయిందన్నారు. ఆ భవనం ఇంటి పన్ను కాంగ్రెస్ కార్యాలయం పేరిట ఉండగా, కరెంట్ మీటర్ చందా హరికృష్ణ అనే వ్యక్తి పేరిట ఉందని అన్నారు. అతడి నుంచి 2023, జూన్ 14న తన వ్యక్తిగత సహాయకుడు కొర్సా నవీన్ పేరిట కొనుగోలు చేసినట్లు ఎమ్మెల్యే వివరించారు. కాగా 2018 అనంతరం కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన రేగా కార్యాలయ రంగులు కూడా మార్చి గులాబీ పార్టీ కార్యాలయంగా కొనసాగించారని ఆరోపించారు. రెండేళ్లుగా ఎన్నోమార్లు పార్టీ కార్యాలయం ఆక్రమణ విషయం కార్యకర్తలు తన దృష్టికి తీసుకువచ్చారని, దాటవేస్తూ వస్తుండటంతో అసహనానికి గురై క్రమశిక్షణతో స్వాధీనం చేసుకునేందుకు వెళ్లారని తెలిపారు.
దాడి తర్వాతే ప్రతిదాడి..
కాంగ్రెస్ కార్యకర్తలను దూషిస్తూ ఆగ్రహం తెప్పించే విధంగా ప్రవర్తిస్తూ బీఆర్‌ఎస్ కార్యకర్తలు దాడి చేశారని, ఆ తర్వాతే కాంగ్రెస్ కార్యకర్తలు తిరిగి దాడులకు పాల్పడ్డారని వివరించారు. దాడి తర్వాతే ప్రతిదాడి తప్ప మరొకటి జరగలేదన్నారు. మోయినాబాద్‌లో రూ.100 కోట్లకు అమ్ముడుపోతూ దొరికిపోయిన రేగా కాంతారావు తెలంగాణ ఉద్యమ సమయంలో ఎక్కడున్నారని ప్రశ్నించారు.
నాడు అధికారం అడ్డం పెట్టుకుని కబ్జా చేశారు..
రేగా కాంతారావు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పార్టీ కార్యాలయం కబ్జా చేస్తే అప్పుడు సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క, వనమా వెంకటేశ్వరరావు ధర్నా చేశారని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పొదెం వీరయ్య అన్నారు. నాడు అధికార బలంతో పోలీసులతో 144 సెక్షన్ పెట్టించి అధికారికంగా కబ్జా చేశాడని ఆరోపించారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకుతో ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచి, ఇప్పుడు అదే కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను గుండాలని వ్యాఖ్యానించడం ఆయనకే చెల్లిందని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ ఏడు మండలాల అధ్యక్షులు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
