వారధికి మరమ్మతులేవి..?
అసంపూర్తిగా శిలాఫలకం
భద్రగిరి వారధి గుంతలమయంగా మారింది. ఆరు దశాబ్దాలుగా సేవలందిస్తున్నా మరమ్మతులు చేపట్టడంలేదు. గోదావరి పాత బ్రిడ్జి నిండా గుంతలు ఏర్పడటంతో వాహనాదారులు అవస్థ పడుతున్నారు. రాత్రి వేళల్లో ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నాయి. మరోవైపు కొత్త బ్రిడ్జి తుది పనులు పూర్తికాలేదు. పంచాయతీ, ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు నిర్వహణను పట్టించుకోకపోవడంతో అధ్వానంగా తయారయ్యాయి.
– భధ్రాచలం
ప్రమాదకరంగా పాత బ్రిడ్జి
1965లో ప్రారంభమైన పాత బ్రిడ్జి సుదీర్ఘ కాలంగా సేవలందిస్తోంది. పెరుగుతున్న రద్దీ దృష్ట్యా కొత్తగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. సుమారు తొమ్మిదేళ్లపాటు నిర్మాణం సాగగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జోక్యం చేసుకుని పనులు పూర్తి చేయించారు. రద్దీ దృష్ట్యా గతేడాది శ్రీరామనవమి నుంచి రెండో బ్రిడ్జిపై వాహనాల రాకపోకలకు అనుమతి ఇచ్చారు. అప్పటినుంచి పాత బ్రిడ్జి నిర్వహణను గాలికొదిలేశారు. దీంతో బ్రిడ్జి పొడవునా ప్రమాదకరంగా పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. సారపాక వైపు అప్రోచ్ రోడ్డు పూర్తిగా కుంగిపోయింది. రెండు వైపులా పిచ్చి మొక్కలు మొలిశాయి. పరిశుభ్రం చేయకపోవడంతో చెత్తాచెదారంతోపాటు మట్టి పేరుకుపోయింది. భద్రగిరి దర్శనానికి వచ్చే భక్తులు ‘ఇదేం దక్షిణ అయోధ్య’ అనుకుంటూ పెదవి విరుస్తున్నారు.
చీకట్లోనే రాకపోకలు
గత శ్రీరామనవమికి కొత్త బ్రిడ్జిపై అనధికారికంగా రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత తుది పనులను మాత్రం అలాగే వదిలేశారు. బ్రిడ్జికి రెండు వైపులా అప్రోచ్ రోడ్డు పూర్తి చేయలేదు. ఇప్పటివరకు విద్యుత్ దీపాలు కూడా ఏర్పాటు చేయలేదు. చిమ్మ చీకట్లోనే రాకపోకలు సాగుతున్నాయి. దీంతో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గతేడాది ద్విచక్రవాహన ప్రమాదంలో యువకులు మృత్యువాత పడ్డారు. నిర్మాణలో లోపం వల్ల వర్షం నీళ్లు బ్రిడ్జిపైనే నిలుస్తున్నాయి. వరదల మాదిరిగా ప్రయాణికులను కలవరపెడుతున్నాయి. ఇలా రెండో బ్రిడ్జిపై సమస్యలు తిష్టవేశాయి.
గతేడాది నుంచి రాకపోకలు సాగిస్తున్నా రెండో బ్రిడ్జిని ఇంతవరకు అధికారికంగా ప్రారంభించలేదు. జాతీయ రహదారుల శాఖ ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టగా, పూర్తిస్థాయిలో పనులు కాకపోవడంతో అధికారికంగా ప్రారంభానికి నోచుకోవడంలేదు. శిలాఫలకం పైలాన్ నిర్మాణం కూడా మధ్యలోనే ఆపేశారు. తుది పనులు సైతం నిలిచిపోయాయి. ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మొదటి బ్రిడ్జికి మరమ్మతులు చేయాలని, కొత్త బ్రిడ్జి తుది పనులను పూర్తి చేయాలని సీతారామ చంద్రస్వామివారి భక్తులు, ప్రయాణికులు కోరుతున్నారు.
వారధికి మరమ్మతులేవి..?
వారధికి మరమ్మతులేవి..?


