వరుస వర్షాలతో తెగుళ్లు
వరికి సుడిదోమ, ఎండు తెగులుతో ముప్పు
తడిసి దెబ్బతిన్న పత్తి, మొక్కజొన్న పంటలు
దిగుబడిపై ఆందోళన చెందుతున్న రైతులు
చర్ల: కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు పైర్లు దెబ్బ తింటున్నాయి. అక్టోబర్ గడుస్తున్నా వానలు కురుస్తుండటంతో పంటలు వర్షార్పణమవుతున్నాయి. తొలితీత దశలో ఉన్న పత్తి, ఇప్పటికే కోసి కల్లాల్లో ఆరబెట్టిన మొక్కజొన్న దెబ్బతిన్నాయి. వరి పంట లో తెగుళ్ల ఉధృతి పెరుగుతోంది ఈ ఏడాది జిల్లాలో సగటు విస్తీర్ణం కంటే అదనంగా 21,988 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. సుమారు 1.85 లక్షల ఎకరాల్లో వరి, 2,21,345 ఎకరాల్లో పత్తి, మొత్తం పంటలు 5.77 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగు చేశారు.
పంటలను ఆశిస్తున్న తెగుళ్లు
జూన్ నుంచి ఇప్పటివరకు జిల్లాలో సాధారణం కంటే 23.8 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. చర్ల, గుండాల, మణుగూరు, టేకులపల్లి, చండ్రుగొండ, సుజాతనగర్ , పాల్వంచ తదితర మండలాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నెలలో కురుస్తున్న భారీ వర్షాలతో అశ్వారావుపేట, పినపాక, భద్రాచలం నియోజకవర్గాల్లో పంటలకు భారీగా నష్టం వాటిల్లుతోంది. అధిక వర్షాలతో పంటలను తెగుళ్లు ఆశిస్తున్నాయి. తేమశాతం ఎక్కువగా ఉండటంతో వరి పంటకు సుడిదోమ (బీపీహెచ్), బ్యాక్టీరియా ఎండు ఆకు (బీఎల్‌బీ), కంకి నల్లి ( పానికల్‌మిట్) వంటి తెగుళ్లు వ్యాపిస్తున్నాయి. ధాన్యం దిగుబడి తగ్గుతుందని రైతులు దిగులు చెందుతున్నారు.
ఖరీఫ్ సీజన్‌లో భారీ వర్షాలతో వరి పంటను తెగుళ్లు ఆశిస్తున్నాయి. సరైన సస్యరక్షణ చర్యలు తీసుకుంటే కొంత మేర నష్టాన్ని తగ్గించుకోవచ్చు. వరి పంటను సుడిదోమ, బ్యాక్టీరియా ఎండు తెగులు, కంకినల్లి వంటివి ఆశిస్తున్నాయి. సుడిదోమ కనిపిస్తే పొలంలో నీరు నిలువ లేకుండా చేయాలి. బ్యాక్టీరియా ఎండు ఆకు తెగలు ఆశిస్తే ఎకరాకు 60 గ్రాముల స్ట్రెప్టోమైసిన్‌సల్ఫేట్ పిచికారీ చేయాలి. ఈ సందర్భంలో యూరియా వేయడం ఆపి వేయాలి. కంకి నల్లి నియంత్రణకు స్పైరోమైసిన్ మందును ఎకరాకు 159 మిల్లీ లీటర్లు పిచికారీ చేయాలి. వర్షం ఆగిన వెంటనే పొలాల్లో నీటి నిల్వను తొలగించాలి. మడుల మధ్య గాలి ప్రసరణ అయ్యేలా దారులు తీయాలి. ఫంగస్ తెగులు నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా నాటివో ఫంగసైడ్ పిచికారీ చేయాలి.
– బి.సుధాకర్‌రావు, ఏడీఏ, భద్రాచలం సబ్ డివిజన్
వరుస వర్షాలతో తెగుళ్లు


