పరిశ్రమల ఏర్పాటుతో ఉద్యోగావకాశాలు
● ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి ● సత్తుపల్లిలో మెగా జాబ్‌మేళా విజయవంతం
సత్తుపల్లి: ప్రతీ జిల్లా కేంద్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సహిస్తూ నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు. సత్తుపల్లిలో సింగరేణి, టాస్క్ సహకారంతో ఆదివారం ఏర్పాటుచేసిన మెగా జాబ్‌మేళాను ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనాభాలో భారతదేశం అగ్రస్థానంలో ఉంటే ఉద్యోగాల్లో మాత్రం అథమ స్థానంలో ఉందన్నారు. జాబ్‌మేళాకు సుమారు 70 కంపెనీలు రావడం, 13 వేల మంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్‌మేళాల ద్వారా యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తోందని, వివిధ నోటిఫికేషన్లతో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూనే ప్రైవేట్ కంపెనీల ద్వారా నిరుద్యోగ సమస్య లేకుండా చూస్తోందని చెప్పారు. జాబ్‌మేళా నిర్వహించిన ఎమ్మెల్యే రాగమయి, సహకరించిన సింగరేణి సంస్థను అభినందించారు. ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి మాట్లాడుతూ.. ఉద్యోగాలు సాధించటం ద్వారా ప్రతీ కుటుంబం ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. అర్హతకు తగిన ఉద్యోగావకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నైపుణ్యం మెరుగుపర్చుకుంటే ఇంకా ఉన్నత స్థాయికి చేరవచ్చని సూచించారు. సింగరేణి ద్వారా సత్తుపల్లిలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. సింగరేణి ఈఅండ్‌ఎం డైరెక్టర్ తిరుమలరావు మాట్లాడుతూ.. కోల్‌బెల్ట్ ప్రాంతంలో ఇది ఆరో జాబ్‌మేళా అని చెప్పారు. అనుభవం లేని వారికి కూడా ఉద్యోగావకాశాలు దక్కినందున కెరీర్ డెవలప్‌మెంట్‌కు ముందడుగు వేయాలని సూచించారు. అనంతరం ఎంపికై న అభ్యర్థులకు నియామకపత్రాలు అందించారు. కార్యక్రమంలో సింగరేణి కొత్తగూడెం ఏరియా జీఎం షాలేంరాజు, ఏసీపీ రఘు, పీఓలు ప్రహ్లాద్, నర్సింహారావు, ఏఎంసీ చైర్మన్లు దోమ ఆనంద్‌బాబు, భాగం నీరజ, మున్సిపల్ కమిషనర్ కోండ్రు నర్సింహా, తోట సుజలారాణి, ఎండీ కమల్‌పాషా, ఉమ్మినేని ప్రసాద్, దొడ్డా శ్రీనివాసరావు, వందనపు సత్యనారాయణ, గాదె చెన్నారావు, పసుమర్తి చందర్‌రావు, మందపాటి ముత్తారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


