ప్రజలతో మమేకం
● కలెక్టర్ జితేష్ వి.పాటిల్‌ది విభిన్న శైలి ● నేలపై కూర్చుని గ్రామస్తులతో మాటామంతి
పాల్వంచరూరల్: కలెక్టర్ నిత్యం విధి నిర్వహణలో క్షణం తీరిక లేకుండా ఉంటారు. జిల్లా అధికార యంత్రాంగానికి సలహాలు, సూచనలు అందిస్తుంటారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాల అమలుపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పర్యవేక్షిస్తుంటారు. కానీ ప్రస్తుత కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఇవన్నీ చేస్తూనే ప్రజలతో మమేకం అవుతున్నారు. భిన్నమైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ఆదివారం పాల్వంచ మండలం బండ్రుగొండ పంచాయతీలోని మారుమూల ఆదివాసీ గ్రామం కొయ్యగట్టును సందర్శించారు. గ్రామంలో స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించారు. అక్కడే రెండు గంటలపాటు గడిపారు. నిర్మాణానికి అవసరమైన మట్టి, ఇసుక, సిమెంట్‌తో (కంప్రెస్డ్ స్టెబిలైజ్డ్ ఎర్త్‌న్) బ్లాక్ ఇటుకలను తానే మట్టి కలిపి తయారుచేసి చూపించారు. స్కూల్ నిర్మాణ పనుల్లో ఐరన్ పైపులను అందించారు. నేలపైన రాయిపై కూర్చుని గ్రామస్తులతో మాట్లాడారు. ఇటీవల కిన్నెరసాని గిరిజన ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన సందర్భంలోనూ పక్కన సీసీ ఉన్నప్పటికీ పిల్లలు, అధ్యాపకులు చెప్పిన సమస్యలను తానే నోటు చేసుకున్నారు. ఇలా నిత్యం ప్రజలతో మేమకం అవుతూ, ఓపికగా సమస్యలు ఉంటూ పరిష్కారానికి కృషి చేస్తున్నారు.
చదువుతోనే సామాజిక, ఆర్థిక మార్పులు
చదువుతోనే సామాజిక, ఆర్థిక మార్పులు వస్తాయని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. మండల పరిధిలోని బండ్రుగొండ గ్రామపంచాయతీ ఆదివాసీ గ్రామం కొయ్యగట్టును ఆదివారం ఆయన ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మతో కలిసి సందర్శించారు. పాఠశాల భవన నిర్మాణాలకు అవసరమైన మట్టి ఇటుకల తయారీపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అందరూ పాఠశాల భవనం నిర్మాణంలో భాగస్వాములు కావాలని సూచించారు. పాఠశాల భవనానికి ఫారెస్ట్ రక్షణ భవనంగా పేరు పెడతామని అన్నారు. విధి నిర్వహణకు అటవీ ఉద్యోగులు కూడా ఒక గది వినియోగించుకోవచ్చన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా నీటి కుంటలు నిర్మించుకోవాలని, చేపలు, కౌజు పిట్టలు, వెదురు పెంపకం చేపట్టి ఆదాయం పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కె.విజయభాస్కర్‌రెడ్డి, ఎంఈఓ శ్రీరాంమూర్తి, హెచ్‌ఎం.బిక్షం, ఆర్‌ఐ నళినీకుమార్, సిబ్బంది పాల్గొన్నారు.


