పెద్దమ్మతల్లికి విశేష పూజలు
పాల్వంచరూరల్: కార్తీకమాసం కావడంతో అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణ కిటకిటలాడింది. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయానికి ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు వచ్చారు. క్యూలైన్ ద్వారా అమ్మవారిని దర్శించుకున్నారు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు అమ్మవారికి విశేష పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, వేదపండితులు పద్మనాభశర్మ, అర్చకుడు రవికుమార్‌శర్మ పాల్గొన్నారు.
నేడు కొత్తగూడెం,
భద్రాచలంలలో ప్రజావాణి
సూపర్‌బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం ఆర్డీఓ, భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయాల్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు భూ సమస్యల పరిష్కారం కోసం సుదూర ప్రాంతాల నుంచి ప్రజావాణి కార్యక్రమానికి వస్తున్నందున, వారి సౌలభ్యం కోసం డివిజన్ల వారీగా ప్రజావాణి నిర్వహణకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇతర సమస్యలపై కలెక్టరేట్ ఇన్‌వార్డ్‌లో తమ దరఖాస్తులను అందజేసి రశీదులు పొందాలని, పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతామని వివరించారు.
పర్యాటకుల జలవిహారం
పాల్వంచరూరల్: కిన్నెరసానిలో ఆదివారం పర్యాటక సందడి నెలకొంది. పొరుగు జిల్లాలో నుంచీ సందర్శకులు తరలివచ్చారు. డ్యామ్, జలాశయం, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. 356 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్‌లైఫ్ శాఖకు రూ.19,980 ఆదాయం లభించింది. 300 మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.15,700 ఆదాయం సమకూరినట్లు నిర్వాహకులు తెలిపారు.
రైతు నేస్తం అవార్డు ప్రదానం
దమ్మపేట: మండలంలోని అల్లిపల్లి గ్రామానికి చెందిన పామాయిల్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆలపాటి రామచంద్రప్రసాద్‌కు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం రైతు నేస్తం అవార్డు అందజేశారు. హైదరాబాద్‌లోని స్వర్ణభారతి మండపంలో ఉమ్మడి ఏపీకి చెందిన రైతు నేస్తం ఫౌండేషన్, స్వర్ణభారతి ట్రస్టు ఆధ్వర్యంలో అవార్డును ప్రదానం చేశారు. అనంతరం శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట మాజీ జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు కోటగిరి సత్యంబాబు, ఎల్లిన రాఘవరావు, నాగప్రసాద్, కేవీ, కొయ్యల అచ్యుతరావు, మురళి, వసంతరావు తదితరులు పాల్గొన్నారు.
రేక్ పాయింట్‌కు చేరిన యూరియా
చింతకాని : మండల పరిధిలోని పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు ఆర్‌ఎఫ్‌సీఎల్ కంపెనీకి చెందిన 2,512.80 మెట్రిక్ టన్నుల యూరియా ఆదివారం చేరింది. టెక్నికల్ ఏఓ పవన్‌కుమార్ ఈ యూరియాను ఖమ్మం జిల్లాకు 1,052.80 మెట్రిక్ టన్నులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 710 మెట్రిక్ టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 550 మెట్రిక్ టన్నులు, ఖమ్మం సీఆర్పీ కి 200 మెట్రిక్ టన్నులు సరఫరా చేశారు.
పెద్దమ్మతల్లికి విశేష పూజలు
పెద్దమ్మతల్లికి విశేష పూజలు


