
శ్రీ దుర్గాదేవిగా పెద్దమ్మతల్లి
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని పెద్దమ్మతల్లి ఆలయంలో జరుగుతున్న శ్రీదేవీ శరన్నవరాత్రుల మహోత్సవాల్లో భాగంగా అమ్మవారు మంగళవారం శ్రీ దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో చండీహోమం, లక్ష కుంకుమార్చన, శ్రీ అంజనేయస్వామికి ఆకుపూజ, శివాలయంలో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, కాలభైరవస్వామికి పంచామృతాభిషేకం గావించారు.
ఐటీడీఏ డీడీగా అశోక్
భద్రాచలం : భద్రాచలం ఐటీడీఏలోని విద్యాశాఖ విభాగంలో ట్రైబల్ వెల్ఫేర్ డీడీగా(పూర్తి అదనపు బాధ్యతలు) జి.అశోక్‌కు పీఓ రాహుల్ నిర్ణయించారు. ఈ మేరకు ఆయన మంగళవారం డీడీ మణెమ్మ నుంచి బాధ్యతలు స్వీకరించారు. అశోక్ ప్రస్తుతం ఐటీడీఏలో ఏటీడీఓగా విధులు నిర్వహిస్తున్నారు. కాగా, బాధ్యతలు స్వీకరించిన అశోక్‌కు కార్యాలయ సిబ్బంది అభినందనలను తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐటీడీఏలో విద్యా రంగ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
సైబర్ నేరాలపై
అప్రమత్తంగా ఉండాలి
సింగరేణి(కొత్తగూడెం): సైబర్ నేరాల పట్ల సింగరేణి ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని సీఎండీ ఎన్.బలరామ్ మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. కార్మికులకు దసరా అడ్వాన్స్, లాభాల బోనస్‌ను వారి ఖాతాల్లో జమ చేశామని, త్వరలో దీపావళి బోనస్ కూడా అందిస్తామని పేర్కొన్నారు. ఈ క్రమంలో మోసం చేసేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నిస్తారని, అలాంటి వారి మాటలు నమ్మి అకౌంట్ నంబర్లు, ఓటీపీలు చెప్పొద్దని కోరారు.
సింగరేణి ప్రధాన కార్యాలయంలో
షేర్ హోల్డర్ల సమావేశం
కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో సీఎండీ ఎన్.బలరామ్ అధ్యక్షతన మంగళవారం కంపెనీ షేర్ హోల్డర్ల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గడిచిన ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభాలు, వ్యయం, నూతన ప్రాజెక్టులు, షేర్ హోల్డర్లకు డివిడెంట్ల కేటాయింపు, సీఎస్సార్ నిధుల కేటాయింపుపై చర్చ జరిగినట్లు సమాచారం. అలాగే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్త ప్రాజెక్ట్‌లకు అనుమతుల సాధన తదితర అంశాలపై చర్చించి, తీర్మానం చేసినట్లు తెలిసింది. ఈ సమావేశంలో షేర్ హోల్డర్లు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన పలువురు ఉన్నతాధికారులు, కోలిండియా ప్రతినిధులు, సింగరేణి డైరెక్టర్లు పాల్గొన్నారు.

శ్రీ దుర్గాదేవిగా పెద్దమ్మతల్లి