
9 కి.మీ.. 900 గుంతలు!
బైక్‌కు రూ.10 వేలు ఖర్చయింది
భయపడుతూ ప్రయాణిస్తున్నాం
● పల్లిపాడు, ఏన్కూరు రోడ్డులో అడుగడుగునా గోతులే.. ● నరక ప్రాయంగా మారిన ప్రయాణం ● ఇబ్బందులు పడుతున్న ప్రజలు ● పట్టించుకోని అఽధికారులు
పల్లిపాడు – ఏన్కూరు రోడ్డు నిర్మాణానికి ఏడాది క్రితమే ప్రతిపాదనలు పంపించాం. పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదు. వర్షాలు పూర్తిగా తగ్గే వరకు రోడ్డు మరమ్మతు చేయడం సాధ్యం కాదు. ఇప్పటికే రెండుసార్లు మడ్ మిక్స్‌తో గుంతలు పూడ్చి వేయించాం. వర్షాలు తగ్గితే రోడ్డు మరమ్మతు చేయిస్తాం.
– మోడేపల్లి రమేష్, ఆర్‌అండ్‌బీ డీఈ, వైరా
కొణిజర్ల: ఉన్నది 9 కిలోమీటర్ల రోడ్డు.. కానీ 900కు పైగా గుంతలున్నాయంటే ఆ రహదారిలో ప్రయాణం ఎలా ఉంటుందో ఊహించుకోండి.. ఈ గుంతల్లో కార్లు, ద్విచక్ర వాహనాలు పడి పలువురు ప్రయాణికులు గాయపడగా, వాహనాలు ధ్వంసమయ్యాయి. అయినా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు.
పల్లిపాడు టు ఏన్కూరు..
కొణిజర్ల మండలం పల్లిపాడు నుంచి అంజనాపురం, జన్నారం మీదుగా ఏన్కూరు మండల కేంద్రం వరకు 2018లో డబుల్ రోడ్డు నిర్మించారు. ఖమ్మం – భద్రాద్రి జిల్లా కేంద్రం కొత్తగూడేన్ని కలిపేందుకు ఇది దగ్గరి దారి. ప్రస్తుతం ఆ రోడ్డు గుంతలమయం కాగా ప్రయాణం నరకప్రాయంగా మారింది. పల్లిపాడు నుంచి అంజనాపురం వరకు ప్రతీ రెండడుగులకో గుంత చొప్పున రోడ్డు జల్లెడ మాదిరిగా తయారైంది. ఆ తర్వాత నాలుగు కి.మీ.దూరంలో ఏన్కూరు ఉండగా.. ఆ రోడ్డు పరిస్థితి అధ్వానంగానే ఉంది. వర్షాకాలం కావడంతో గోతుల్లో నీరు నిండగా ఎక్కడ గుంత ఉందో తెలియక ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. కొణిజర్ల మండలం తీగలబంజరకు చెందిన ఓ యువకుడు మూడు నెలల క్రితం గుంతను తప్పించబోయి కిందపడి కోమాలోకి వెళ్లి మూడు రోజుల చికిత్స అనంతరం మృతి చెందాడు. లాలాపురానికి చెందిన ఓ యువకుడు కారులో ప్రయాణిస్తుండగా గుంతలో టైరు దిగబడి రిమ్ము పూర్తిగా ధ్వంసం కాగా రూ.50వేలకు పైగా నష్టపోయినట్లు తెలిపాడు. ఇక లాలాపురం – తీగలబంజర మధ్య పగిడేరుకు వరద వస్తే రోడ్డు కొట్టుకుపోయి మరింత ప్రమాదకరంగా మారుతోంది. ఏటిపై నిర్మించిన చప్టాకు రక్షణ గోడలు లేకపోవడంతో వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. ఈ రోడ్డును హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ పద్ధతిన ప్రభుత్వం 40 శాతం, ప్రైవేట్ సంస్థలు 60 శాతం వాటా ధనంతో పునః నిర్మాణానికి ప్రతిపాదనలు పంపారు. అయితే పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు.
శిథిలావస్థలో కల్వర్టులు..
2018 లో రోడ్డు నిర్మించినప్పుడు ఆర్‌అండ్‌బీ అధికారులు కల్వర్టుల నిర్మాణాలపై ప్రతిపాదనలు రూపొందించకపోవడంతో పాత కల్వర్టులపైనే రోడ్డు వేశారు. ప్రస్తుతం ఆ కల్వర్టులు శిథిలావస్థకు చేరుకున్నాయి. పల్లిపాడు సమీపంలో కల్వర్టు కూలగా పైపువేసి మట్టితో పూడ్చారు. లాలాపురం – తీగలబంజర సమీపంలో కల్వర్టులు కుంగి ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. అంజనాపురం సమీపంలో నిమ్మవాగుపై నిర్మించిన లో లెవల్ చప్టా కూడా కూలేందుకు సిద్ధంగా ఉంది.
పల్లిపాడు నుంచి సింగరాయపాలెం వరకు రోజూ ద్విచక్రవాహనంపై తిరుగుతుంటా. ఈ క్రమంలో గుంతలో పడి నా బైక్ ధ్వంసమైంది. రిపేర్ చేయిస్తే రూ.10 వేలు ఖర్చయ్యాయి. రోడ్డు గుంతల మయంగా మారినా అధికారులు పట్టించుకోవడం లేదు.
– షేక్ నాగుల్‌మీరా, సింగరాయపాలెం
పల్లిపాడు నుంచి అంజనాపు రం వరకు రోజూ ఆటో తిప్పుతుంటా. ఈ 9 కి.మీ. ప్రయా ణం చేయడానికి గంటకు పైగా పడుతోంది. గుంతల్లో పడి ఆటోలు ప్రమాదాలకు గురవుతున్నాయి. రాత్రి పూట ఈ రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే భయపడుతున్నాం. అధికారులు స్పందించి మరమ్మతు చేయాలి. – ముత్తనబోయిన లెనిన్,
అటో డ్రైవర్, తీగలబంజర

9 కి.మీ.. 900 గుంతలు!

9 కి.మీ.. 900 గుంతలు!

9 కి.మీ.. 900 గుంతలు!