
అడవి రామవరం
అతి తక్కువగా ఓటర్లు..
భద్రాచలంలో అత్యధిక ఓటర్లు...
అతి చిన్న పంచాయతీ..
● గ్రామంలో ఓటర్లు 85 మంది ● పంచాయతీలో నాలుగు వార్డులు
చుంచుపల్లి: ఆళ్లపల్లి మండలంలోని అడవి రామవరం జిల్లాలోనే అతి తక్కువ ఓటర్లు ఉన్న గ్రామ గ్రామపంచాయతీగా నిలిచింది. గ్రామంలో కేవలం 85 మంది మాత్రమే ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళలు 40 మంది, పురుషులు 45 మంది ఉన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఈ నెల 2న గ్రామాల వారీగా ఓటర్ల తుది జాబితాలు వెల్లడించారు. దీంతో అడవి రామవరం జిల్లాలో అతి చిన్న గ్రామపంచాయతీగా తేలింది.
2019లో 71 మంది ఓటర్లు
అడవి రామవరం పినపాక నియోజకవర్గం ఆళ్లపల్లి మండలంలో అత్యంత మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో ఎలాంటి రహదారి సౌకర్యం లేని కుగ్రామం. 2018లో అప్పటి ప్రభుత్వం తెచ్చిన పంచాయతీరాజ్ చట్టం ద్వారా మర్కోడు గ్రామం నుంచి విడదీసి అడవి రామవరాన్ని కొత్త పంచాయతీగా ఏర్పాటు చేశారు. గ్రామంలో 105 మంది జనాభా నివసిస్తున్నారు. 2019లో తొలిసారిగా 71 మంది ఓటర్లతో నాలుగు వార్డులకు, సర్పంచ్ పదవికి ఎన్నికలు నిర్వహించారు. సర్పంచ్‌గా ఎస్టీ మహిళ ఎన్నికయ్యారు. గ్రామపంచాయతీ కార్యాలయం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనంలో కొనసాగిస్తున్నారు.
గతంలో దొంగతోగు రికార్డు
దొంగతోగు గ్రామం రాష్ట్రంలోనే అతిచిన్న పంచా యతీగా నిలిచింది. ఇది గుండాల నుంచి 2018లో కొత్త పంచాయతీగా ఏర్పాటైంది. 2019లో 36 మంది ఓటర్లతో నాలుగు వార్డులు, సర్పంచ్ స్థానానికి ఎన్నికలను నిర్వహించారు. తాజా లెక్కల ప్రకారం దొంగతోగు గ్రామపంచాయతీ ప్రస్తుతం 88 మంది ఓటర్లతో ద్వితీయస్థానంలో నిలిచింది. ఇందులో పురుషులు 48మంది, మహిళలు 40 మంది ఉన్నారు.
అడవి రామవరం గ్రామానికి సంబంధించిన ఓటరు జాబితాను ఈ నెల 2న పంచాయతీ కార్యాలయంలో ప్రచురించాం. గ్రామంలోని 4 వార్డుల పరిధిలో కేవలం 85 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం జిల్లాలో అతి తక్కువ ఓటర్లు ఉన్న గ్రామంగా అడవి రామవరం నిలిచింది.
–తంబాల పుష్పరాజ్, కార్యదర్శి, అడవిరామవరం
ఈ నెల 2న జిల్లాలోని 471 గ్రామ పంచాయతీల పరిధిలోని 4,168 వార్డులకు సంబంధించిన ఓట రు జాబితాలను ప్రచురించారు. మొత్తం 6,69, 048 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారికంగా లెక్క తేల్చారు. వీరిలో పురుషులు 3,25,045 మంది, మహిళలు 3,43,979 మంది, ఇతరులు 24మంది ఉన్నా రు. పురుషుల కంటే 18,934 మంది మహిళలు అధికంగా ఉన్నట్లు వెల్లడైంది. గతేడాది సెప్టెంబర్‌లో ప్రకటించిన జాబితా కంటే 45,101 మంది ఓటర్లు ఎక్కువగా నమోదయ్యారు. అడవి రామవరం అత్యల్పంగా 85 మంది ఓటర్లును కలిగిఉండగా, ఆ తర్వాత దొంగతోగులో 88 మంది ఓటర్లు ఉన్నారు. నల్లబండబోడులో 144 మంది, వెంకటేష్‌ఖనిలో 183 మంది, చింతల తండాలో 219 మంది, పెద్దిపల్లిలో 252 మంది ఓటర్లు ఉన్నట్లు తేలింది. జిల్లాలో అత్యధికంగా భద్రాచలం గ్రామపంచాయతీలో 20 వార్డుల పరిధిలో 40,761 మంది ఓటర్లు ఉన్నారు.

అడవి రామవరం