
పోటెత్తిన ఆయిల్‌పామ్ గెలలు
దమ్మపేట: మండలంలోని అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీకి శనివారం ఆయిల్‌పామ్ గెలలు పోటెత్తాయి. ఫ్యాక్టరీ బయట ప్రాంగణంలో గెలలతో వచ్చిన వందకు పైగా ట్రాక్టర్లు బారులుదీరా యి. ఫ్యాక్టరీ క్రషింగ్ సామర్థ్యం గంటకు 90 టన్నులు కాగా సాయంత్రం 5 గంటలకే 2,500 టన్నుల గెలలను ఫ్యాక్టరీలో ప్లాట్‌ఫాం కింద దిగుమతి చేశారు. ఇటీవల కొద్దిరోజులపాటు వర్షాలు కురిశా యి. ఆ సమయంలో గెలల కోత వీలుకాదు. వర్షాలు తగ్గిపోవడంతో రైతులు గెలలు కోస్తుండటంతో ఒక్కసారిగా ఫ్యాక్టరీలకు పోటెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ మేనేజర్ కళ్యాణ్ మాట్లాడు తూ శనివారం రాత్రి వరకు 3 వేల టన్నుల గెలలు రావచ్చని తెలిపారు. రోజుకు సుమారుగా 1,500 టన్నుల మేరకు గెలలను క్రషింగ్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఒక వాహనం అన్‌లోడ్ కావడానికి సుమారుగా 3గంటల సమయం పడుతోందని, ఆదివారంనుంచి యథావిధిగా అశ్వారావుపేట ఫ్యా క్టరీకీ గెలలను తరలించవచ్చని వివరించారు.
అశ్వారావుపేటలో సామర్థ్యానికి మించి..
అశ్వారావుపేట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీకి కూడా క్రషింగ్ సామర్థ్యానికి మించి గెలలు వచ్చాయి. సుమారు 700 టన్నుల గెలలు వచ్చినట్లు తెలుస్తుండగా, అంతకు మించి నిల్వ చేసేందుకు స్టాక్‌యార్డు కూడా లేదు. దీంతో శుక్రవారం నుంచి అటువైపు వెళ్లాల్సిన గెలలను కూడా అప్పారావుపేటకే తరలిస్తున్నారు. దీంతో ఇక్కడ కూడా క్రషింగ్ సామర్థ్యానికి మించి గెలలు వస్తున్నాయి. అప్పారావుపేట ఫ్యాక్టరీ క్రషింగ్ సామర్థ్యం గంటకు 90 టన్నులు కాగా, ఆ మేరకు క్రషింగ్ జరగనట్లు తెలుస్తోంది. రోజుకు 1,800 టన్నులను క్రషింగ్ జరగాల్సి ఉండగా యంత్రాల్లోని లోపాల కారణంగా 1,500 టన్నులనే క్రషింగ్ చేస్తున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. అశ్వారావుపేట ఫ్యాక్టరీ క్రషింగ్ సామర్థ్యం గంటకు 30 నుంచి 60 టన్నులకు పెంచామని యాజమాన్యం పేర్కొంటున్నా.. ఆ మేరకు క్రషింగ్ జరగడం లేదని రైతులు చెబుతున్నారు.
అప్పారావుపేట ఫ్యాక్టరీవద్ద
బారులుదీరిన 100 ట్రాక్టర్లు

పోటెత్తిన ఆయిల్‌పామ్ గెలలు