
నిమజ్జనం.. జర భద్రం
భక్తులు సహకరించాలి..
నిమజ్జనానికి భారీ బందోబస్తు..
భద్రాచలంఅర్బన్: జిల్లావ్యాప్తంగా వినాయకచవితి సంబరాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. విభిన్న రూపాల్లో కొలువుదీరిన ఆదిదేవుడిని భక్తులు పూజిస్తూ పరవశిస్తున్నారు. అయితే విగ్రహాలను నిమజ్జనం చేసే సందర్భంగా ఎలాంటి అపశ్రుతులు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు పాటించాలని పోలీసులు, అధికారులు సూచిస్తున్నారు. నవరాత్రులు ప్రారంభమైన ఐదోరోజు నుంచే నిమజ్జన కార్యక్రమాలు సాగుతుండగా.. ఈ నెల 6న వేలాది విగ్రహాలను భద్రాచలం గోదావరి తీరానికి తీసుకురానున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.
డ్రైవర్ పాత్ర కీలకం..
నిమజ్జన శోభాయాత్రలో ప్రధానంగా ఆయా వినాయక ప్రతిమలను ఊరేగించే వాహనాల డ్రైవర్లు అనుభవజ్ఞులై ఉండాలి. పొరపాట్లు జరగకుండా ముందుగానే సదరు డ్రైవర్లకు పోలీసులతో పాటు ఉత్సవ కమిటీ నిర్వాహకులు సలహాలు, సూచనలు ఇవ్వాలి. రోడ్లపై గతుకులు, గుంతలు, స్పీడ్ బ్రేకర్ల వద్ద జాగ్రత్తగా నడపాలి. విద్యుత్ తీగల విషయంలో అప్రమత్తతతో వ్యవహరించాలి. ప్రతిమ వద్ద ఎక్కువ మంది జనం లేకుండా చూసుకోవాలి.
అప్రమత్తంగా ఉండాలి..
గణేశ్ నిమజ్జన శోభాయాత్ర కార్యక్రమంలో పాల్గొనే పిల్లల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. పిల్లలకు తగిన జాగ్రత్తలు చెప్పి బయటకు పంపాలి. నిమజ్జనానికి చిన్నారులను ఒంటరిగా పంపడం మంచిదికాదు. తెలిసిన వారితో లేదా కుటుంబ సభ్యులు తోడుగా ఉండేలా చూసుకోవాలి. శోభాయాత్రను చూసేందుకు ఎత్తుగా ఉన్న భవనాలు, రేకుల షెడ్లు, పాతభవనాలు ఎక్కినపుడు జాగ్రత్తగా ఉండాలి. ఇక నిమజ్జనం సందర్భంగా క్యూ పద్ధతి పాటించాలి. ఒక వాహనం తర్వాత ఇంకో వాహ నం వెళితే ఎవరికీ ఇబ్బందులు ఉండవు. భక్తులకు సౌకర్యంగా ఉంటుంది. ఇక ప్రతిమలను చెరువు లు, కుంటలు, ప్రాజెక్టుల వద్ద నిమజ్జనం చేసే సమయాన జాగ్రత్తలు పాటించాలి. ఈత రాని వారు, పిల్లలు సహా ఎవరూ లోనికి వెళ్లకుండా సిబ్బందికి విగ్రహాలు అప్పగించాలి.
నిమజ్జనానికి భారీ బందోబస్తు
భద్రాచలం గోదావరిలో గణేశ్ నిమజ్జనం చేయనున్న ఘాట్ వద్ద భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్‌కుమార్‌సింగ్ పర్యవేక్షణలో 250 మంది పోలీసులు అంతేకాక 15 మంది వైద్య బృందం (మూడు షిఫ్ట్‌లలో), ఒక 108 అంబులెన్సు, మరో లైఫ్ సపోర్ట్ ఎమర్జెన్సీ వాహనాన్ని సిద్ధంగా ఉంచారు. రెండు షిఫ్ట్‌లలో 36 మంది ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది, 10 మంది గ్రామ పంచాయతీ సిబ్బంది, అంతే కాకుండా 12 మంది గజ ఈతగాళ్లు, దేవస్థానం సిబ్బంది 24గంటల పాటు కూడా అందుబాటులో ఉండను న్నారు. నిమజ్జనానికి మూడు భారీ క్రేన్లతో పాటు జేసీబీలను అధికారులు అందుబాటులో ఉంచారు.
సిబ్బందికి బాధ్యతలపై సూచనలిస్తున్న
భద్రాచలం టౌన్ సీఐ నాగరాజు
వినాయక నిమజ్జనానికి వచ్చే భక్తులు అధికారుల సూచనల మేరకు నడుచుకోవాలి. ఏ నిబంధన అమలు చేస్తున్నా అది మీ భద్రత కోసమేనని గుర్తుంచుకోవాలి. నిమజ్జనంలో పాల్గొనే భక్తులు, కమిటీ సభ్యులు పోలీసులు సూచించిన రూట్ మ్యాప్ ద్వారానే రావాలి. ఏదైనా ఇబ్బంది ఉంటే డయల్ 100కి కాల్ చేయండి. తొందర పాటుతో ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు.
–బి.రోహిత్ రాజు, ఎస్పీ
భద్రాచలం గోదావరిలో జరగనున్న నిమజ్జనోత్సవంలో ఈ సారి ప్రత్యేకంగా 250 మంది పనిచేస్తున్నాం. ఎక్కడా వినాయకులు ఎక్కువ సేపు ఆగకుండా మా సిబ్బంది ముందుకు సాగనంపుతారు. ఎక్కడైనా ఇబ్బందులుంటే వెంటనే పోలీసులను ఆశ్రయించాలి. ఆరుగురు సీఐలతో పాటు 15 మంది ఎస్‌ఐలు, 231 మంది సిబ్బందిని బందోబస్తుకు వినియోగిస్తున్నాం.
–విక్రాంత్ కుమార్‌సింగ్, ఏఎస్పీ, భద్రాచలం

నిమజ్జనం.. జర భద్రం

నిమజ్జనం.. జర భద్రం