
ఆలస్యమే కలిసొచ్చింది!
గత పంచాయతీ ఎన్నికల్లో
లెక్కలు సమర్పించని 292 మంది
వారందరిపైనా అనర్హత వేటేసిన
రాష్ట్ర ఎన్నికల సంఘం
2024 ఏప్రిల్‌తో ముగిసిన
నిషేధిత కాలపరితిమితి
స్థానిక ఎన్నికల ఆలస్యంతో
పోటీకి దక్కిన అవకాశం
చుంచుపల్లి: సకాలంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోవడం వేటు పడిన అభ్యర్థులకు మేలు చేసింది. ఇప్పుడు వారందరికీ తిరిగి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభించింది. గత గ్రామపంచాయతీ ఎన్నికల్లో బరిలో నిలిచిన పలువురు అభ్యర్థులు నిర్ణీత వ్యవధిలో తమ ఖర్చుల లెక్కలు సమర్పించలేదు. దీంతో వారిపై రాష్ట్ర ఎన్నికల సంఘం మూడేళ్లపాటు అనర్హత వేటు వేసింది. అయితే నిషేధ కాలపరిమితి ముగిసింది. దీంతోవేటు పడిన వారందరిలో ఇప్పడు ఆశలు చిగురిస్తున్నాయి. మరోసారి ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు.
ఎన్నికలు సకాలంలో జరగక..
2019 జనవరిలో జిల్లాలోని 479 గ్రామ పంచాయతీలకు 4,232 వార్డులకు మూడు విడతలుగా ఎన్నికలు జరిగాయి. గ్రామపంచాయతీ పాలకవర్గాల పదవీకాలం గతేడాది ఫిబ్రవరి 1తో ముగిసింది. ఆ వెంటనే లోక్‌సభకు ఎన్నికలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారుల పాలనను అమల్లోకి తెచ్చింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల పదవీకాలం సైతం గతేడాది ఆగస్టు మొదటి వారంతో ముగియగా, పరిషత్‌లో కూడా స్పెషలాఫీసర్ల పాలనే కొనసాగిస్తోంది. అయితే సకాలంలో పంచాయతీలకు ఎన్నికలు జరిగితే జిల్లాలో అనర్హతకు గురైన అనేక మంది అభ్యర్థులు పోటీకి దూరమయ్యేవారు.
292 మందిపై అనర్హత వేటు
నూతన పంచాయతీరాజ్ చట్టం–2018 ప్రకారం 2019లో జనవరిలో 479 గ్రామ పంచాయతీలకు, మేలో 219 ఎంపీటీసీలు, 21 జెడ్పీటీసీ పదవులకు ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల్లో పోటీపడిన అభ్యర్థులు ఫలితాలు వెలువడిన తర్వాత 45 రోజుల్లోగా తమ ప్రచారానికి ఎంత ఖర్చు చేశారో నిర్దేశిత నమూనాలో ఆయా ఎంపీడీఓ కార్యాలయాల్లో సమర్పించాలి. ఐదు వేల లోపు జనాభా కలిగిన పంచాయతీలో పోటీచేసే వార్డు సభ్యుడు రూ. 30,000 వరకు, సర్పంచ్ అభ్యర్థులు రూ.1,50,000 వరకు ఖర్చు చేయాలని, 5 వేలకు పైగా జనాభా కలిగిన గ్రామ పంచాయతీల్లో పోటీ చేసే వార్డు సభ్యులు రూ.50వేలు, సర్పంచ్ అభ్యర్థులు ప్రచారం నిమిత్తం రూ.2,50,000 వరకు ఖర్చు చేసుకునే వెసులుబాటును కల్పించారు. నిబంధనల ప్రకారం గెలిచిన, ఓడిన అభ్యర్థులు ఖర్చుల వివరాలను వెల్లడించాలి. ఇందులో కొందరు వార్డు సభ్యులు గెలిచినా నిర్లక్ష్యంతో అధికారులకు ఖర్చు ల వివరాలు సమర్పించలేదు. ఓడిపోయిన మరి కొందరు ఎన్నికల నిబంధనలను అతిక్రమించారు. ఆయా అభ్యర్థులకు ఈసీ పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందన లేదు. దీంతో ఎంపీడీఓలు సమర్పించిన నివేదికల ఆధారంగా ఎన్నికల సంఘం 2021 నవంబర్‌లో కొందరు అభ్యర్థులపై అనర్హత విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలో గెలిచిన 96 మంది అభ్యర్థులతోపాటు ఓడిపోయిన మరో 196 మంది.. మొత్తం 292 మంది అనర్హతకు గురయ్యారు. వీరిలో ములకలపల్లి మండలంలోనే 96 మంది వరకు అభ్యర్థులు గెలుపొందిన ఉన్నారు. కొందరు ఉపసర్పంచ్‌లు కూడా ఉండటం గమనార్హం. వీరంతా 2024 ఏప్రిల్ వరకు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయడానికి అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఈసీ ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. గ్రామ పంచాయతీలకు ఎన్నికల నిర్వహణలో తీవ్ర జాప్యం జరగడంతో అనర్హత వేటు కాలపరిమితి ముగిసిపోయింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు ఈ నెలలో నిర్వహిస్తామని ప్రకటించడంతో వారు కూడా పోటీకి సిద్ధమవుతున్నారు.