
పంటలను పరిశీలించిన ట్రెయినీ కలెక్టర్
టేకులపల్లి : ట్రెయినీ కలెక్టర్ సౌరభ్‌శర్మ టేకులపల్లి మండలంలో మంగళవారం పర్యటించారు. గోలియాతండాలో పత్తి పంటలను పరిశీలించి.. ఇప్పటివరకు పెట్టుబడి ఎంత పెట్టారు, ప్రస్తుతం పంట పరిస్థితి ఎలా ఉంది అని రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల వ్యవసాయ కార్యాలయంలో అధికారులతో సమావేశం అయ్యారు. ఈ ప్రాంత భౌగోళిక స్వరూపం, నూతన వ్యవసాయ పద్ధతులు, నేలల స్వభావం, పంటల విస్తీర్ణం, రైతు భరోసా, రైతు బీమా పథకాల అమలు, మార్కెటింగ్ తదితర అంశాలపై చర్చించారు. రైతులకు వ్యవసాయ రుణాలు సక్రమంగా అందుతున్నాయా, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎన్ని ఏర్పాటు చేస్తారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏడీఏ గుగులోత్ లాల్‌చంద్, ఏఓ అన్నపూర్ణ, ఆత్మ చైర్మన్ బోడా మంగీలాల్, ఏఈఓలు శ్రావణి, విశాల, రమేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.