
గిరిజన ఇలవేల్పులపై అధ్యయనం
గుండాల : గిరిజనులు సంస్కృతి, సంప్రదాయాలతో నిర్వహిస్తున్న ఇలవేల్పుల పండుగలపై అధ్యయనం చేసి వారి చరిత్రను పుస్తక రూపంలో అందించేందుకు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో శనివారం ఆయన ఆళ్లపల్లి మండలంలోని పలు గిరిజన గ్రామాల్లో ఉన్న ఆలయాలను సందర్శించారు. పెద్దూరు గ్రామంలో కొమురం వంశీయులతో చర్చించారు. రెక్కల రామక్క జాతర ఎప్పుడు, ఎలా నిర్వహిస్తారని అడిగి తెలుసుకున్నారు. ఇంకా మండలంలో ఏయే గ్రామాల్లో జాతరలు జరుపుతారు.. ఇలవేల్పులు ఎలా అవతరించాయని ఆరా తీశారు. ఇప్పనపల్లిలో గొగ్గెల వారి ఇలవేల్పు, పెద్దూరులో కొమరం వంశీయుల ఇలవేల్ప యిన రెక్కల రామక్క, నడిమిగూడెం పాయం వంశీయుల ఇలవేల్పు రణాసురుడు తదితరుల చరిత్రపై అధ్యయనం చేస్తామని చెప్పారు. గత మార్చిలో జరిగిన జాతరలకు తాను పని ఒత్తిడి కారణంగా రాలేకపోయానని తెలిపారు. ఆయన వెంట ఏటీడీఓ రాధమ్మ, ఐటీడీఏ మ్యూజియం ఇన్‌చార్జ్ కొండ్రు వీరస్వామి, రిటైర్డ్ హెచ్‌ఎం జగపతి, కొమరం రాంబాబు తదితరులు ఉన్నారు.
వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి
భద్రాచలంటౌన్: భద్రాచలం ఏజెన్సీలోని మారుమూల గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటుచేయాలని పీఓ బి.రాహుల్ అన్నారు. వైద్యారోగ్యశాఖ అధికారులతో కలిసి పీహెచ్‌సీల పనితీరుపై సమీక్షించారు. భద్రాచలం, పాల్వంచ, చర్ల, మణుగూరు, ఇల్లెందు, బూర్గంపాడు, అశ్వారావుపేట పీహెచ్‌సీల్లో అన్ని రకాల వైద్య పరీక్షలతో పాటు వైద్యులను నియమించామని తెలిపారు. పీహెచ్‌సీ, సీహెచ్‌సీల్లో డయాలసిస్ చికిత్సలు, సాధారణ ప్రసవాలు చేయాలన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు పాటించాలని, వరద ముంపు గ్రామాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆరేశించారు. డీసీహెచ్‌ఎస్ రవిబాబు మాట్లాడుతూ.. చర్ల సీహెచ్‌సీలో త్వరలో ఆపరేషన్ థియేటర్ ప్రారంభిస్తామని, హాజరు కావాలని పీఓను కోరారు. సమావేశంలో భద్రాచలం ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ రామకృష్ణ, ఆర్‌ఎంఓ సంతోష్, యశోదా రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఆలయాలను సందర్శించిన
ఐటీడీఏ పీఓ