
కిచిడీలో పురుగులు..!
● తినకుండానే తరగతులకు వెళ్లిన గురుకుల కళాశాల విద్యార్థినులు ● విచారణకు ఆదేశించిన ఐటీడీఏ పీఓ
భద్రాచలంటౌన్: భద్రాచలంలోని గిరిజన సంక్షేమ గురుకులు బాలికల జూనియర్ కళాశాలలో శనివారం ఉదయం వడ్డించే కిచిడీలో పురుగులు కనిపించడంతో విద్యార్థినులు ఆందోళన చేశారు. అల్పాహారం తినకుండానే తరగతి గదిలోకి వెళ్లారు. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతోనే పురుగు పట్టిన బియ్యంతో వంట చేస్తున్నారని, గత మూడు రోజులుగా ఇలాగే చేస్తుండగా ప్రిన్సిపాల్‌కు చెప్పినా పట్టించుకోలేదని వాపోయారు. ఈ కళాశాలలో సుమారు 600 మంది విద్యార్థినులం ఉన్నామని, మూడు రోజులుగా ఆకలితో అలమటిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఈ విషయం తెలియగానే ఐటీడీఏ పీఓ రాహుల్ విచారణకు ఆదేశించారు. పూర్తిస్థాయిలో పరిశీలన చేపట్టి నివేదిక అందించాలని విచారణాధికారిగా నియమించిన ఆర్సీఓకు సూచించారు. బాలికలకు నాణ్యమైన ఆహారం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, పురుగులు వచ్చిన బియ్యాన్ని ప్రిన్సిపాల్ గుట్టుచప్పుడు కాకుండా జీసీసీ గోడౌన్‌కు పంపించారు. అయితే, విద్యార్థినులు ఆకలితో ఇబ్బంది పడకుండా బిస్కట్లు అందించామని, పురుగుపట్టిన బియ్యాన్ని గోడౌన్‌కు తరలించి మంచి బియ్యం తెప్పిస్తున్నామని ఆ తర్వాత పీఓ రాహుల్ ప్రకటించారు.