
అభివృద్ధిలో భాగస్వాములను చేస్తాం
● ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి ● రేడియో కేంద్రం నుంచి ప్రత్యక్ష ప్రసారంలో కలెక్టర్ పాటిల్
చుంచుపల్లి : జిల్లా అభివృద్ధిలో ప్రజలందరినీ భాగస్వాములను చేస్తామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ప్రజా సమస్యలపై వారితో నేరుగా మాట్లాడేందుకు శనివారం ఆయన కొత్తగూడెం ఆకాశవాణి కేంద్రం నుంచి ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు ఫోన్ ద్వారా కలెక్టర్‌కు పలు సమస్యలు, అభిప్రాయాలు, సూచనలు తెలియజేశారు. ముఖ్యంగా ఆరోగ్యం, విద్య, గ్రామీణ రహదారులు, తాగునీటి సమస్య, రేషన్ కార్డుల జారీ, పెన్షన్ పంపిణీలో జాప్యం తదితర అంశాలను ప్రస్తావించారు. వాటన్నింటినీ ఆసక్తిగా విన్న కలెక్టర్.. పలు సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఆకాశవాణి ద్వారా ప్రజలతో ప్రత్యక్ష ప్రసారంలో మాట్లాడటం మంచి అనుభూతి ఇచ్చిందని తెలిపారు. అందరి అభిప్రాయాలు, సూచనలు ఎంతో విలువైనవని అన్నారు. వ్యవసాయం వ్యర్థమని ఎవరూ భావించొద్దని, అది రైతుల జీవనాధారమని అన్నారు. యువత ఉద్యోగాల కోసం నిరీక్షించకుండా ఉన్న భూములను సద్వినియోగం చేసుకుంటూ ఆయిల్‌పామ్, మునగ సాగుతో పాటు చేపల పెంపకం వంటివి చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ హెడ్ కొలిపాక శంకర్ రావు, సిబ్బంది ప్రభాకర్, ఆనంద్, సుమన్, కోటేశ్వరరావు, కట్ట రామకృష్ణ, శ్రీనివాస్ పాల్గొన్నారు.
స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యాచరణ పాటించాలి..
గ్రామాల్లో పరిశుభ్రత పెంచేందుకు ఐదు రోజుల కార్యాచరణ అమల్లోకి తేవాలని కలెక్టర్ పాటిల్ అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌పై శనివారం ఆయన అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారంలో ఐదు రోజుల పాటు స్వచ్ఛ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు, విద్యాసంస్థల్లో సోమవారం పిచ్చి మొక్కలు తొలగించి, ప్రజలకు ఉపయోగపడే మొక్కలు నాటాలని ఆదేశించారు. మంగళవారం తడి – పొడి చెత్త వేరు చేయడంతో లాభాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఇకపై మంగళ ,శుక్రవారాల్లోనే పొడి చెత్త సేకరించాలని తెలిపారు. బుధవారం ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో నిరుపయోగ వస్తువులు తొలగించాలని, నీటి నిల్వలు లేకుండా చూడాలని అన్నారు. గురువారం డ్రెయినేజీల శుభ్రత, దోమల నివారణకు మందుల పిచికారీ, శుక్రవారం వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.