
బ్రిడ్జి పనుల్లో నాణ్యత పరిశీలన
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని రెడ్డిగూడెం వద్ద ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన పథకం కింద రూ.177 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న హైలెవల్ బ్రిడ్జి పనులను రాష్ట్ర క్వాలిటీ మానిటరింగ్ అధికారి ఇ.దశరథం శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. పనుల్లో నాణ్యత పాటించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ డీఈ రామకృష్ణ, ఏఈలు శివలాల్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
15 మంది మైనింగ్ అధికారుల బదిలీ
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణిలో 15 మంది మైనింగ్ అధికారులను బదిలీ చేస్తూ కార్పొరేట్ ఈఈ సెల్ హెచ్‌ఓడీ ఎ.జె. మురళీధర్ రావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వారిలో ఎనిమిది మంది డిప్యూటీ జీఎం స్థాయి అధికారులు, ఒకరు సూపరింటెండెంట్ ఆఫ్ మైన్స్ ఇంజనీర్, ఇద్దరు అడిషినల్ మేనేజర్లు, ఒక ఎస్‌ఈ, ముగ్గురు డిప్యూటీ ఎస్‌ఈ స్థాయి అధికారులు ఉన్నారు. వీరంతా ఈనెల 31వ తేదీ లోగా కేటాయించిన ఏరియాల్లో విధుల్లో చేరాలని సూచించారు.
నేరాల నివారణకు
చర్యలు చేపట్టాలి
ఎస్పీ రోహిత్‌రాజు ఆదేశం
పాల్వంచ : సబ్ డివిజన్లలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నేరాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఎస్పీ రోహిత్ రాజు అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన పాల్వంచ డీఎస్పీ కార్యాలయాన్ని పరిశీలించారు. సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతీ ప్రదేశంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు, వ్యాపారులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎలాంటి సమాచారం వచ్చినా అధికారులు, సిబ్బంది వెంటనే స్పందించాలని, ఎప్పటికప్పుడు కేసులు పరిష్కరించాలని అన్నారు. అనంతరం కార్యాలయంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో పాల్వంచ డీఎస్పీ ఆర్.సతీష్‌కుమార్, పాల్వంచ, అశ్వారావుపేట సీఐలు సతీష్, నాగరాజు రెడ్డి, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
పౌర సేవలు వేగవంతం చేయాలి
బూర్గంపాడు: ప్రజల ఆర్జీలను సత్వరమే పరిష్కరించాలని, పౌర సేవలు వేగవంతం చేయాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్ సూచించారు. బూర్గంపాడు తహసీల్ కార్యాలయాన్ని శనివారం ఆయన సందర్శించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కేఆర్‌కేవీ ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.
వైద్యుల పోస్టులకు
దరఖాస్తుల ఆహ్వానం
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలోని ప్రాంతీయ ఆస్పత్రి, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో వైద్యుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీసీహెచ్‌ఎస్ డాక్టర్ రవిబాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అశ్వారావుపేటలోని ప్రాంతీయ ఆస్పత్రిలో మత్తు వైద్య నిపుణుడు, పాల్వంచ, చర్ల సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో గైనకాలజిస్టు పోస్టులు.. మొత్తం మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నెల 26వ తేదీ లోగా తమ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని కోరారు.

బ్రిడ్జి పనుల్లో నాణ్యత పరిశీలన

బ్రిడ్జి పనుల్లో నాణ్యత పరిశీలన