
జిల్లాలో యూరియా కొరత లేదు
● అసత్య ప్రచారంతోనే విక్రయ కేంద్రాలలో రైతుల రద్దీ ● గోదాముల్లో 6,200 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయి ● డీఏఓ బాబూరావు వెల్లడి
ఇల్లెందురూరల్ : జిల్లాలో యూరియా కొరత లేదని, రైతుల అవసరాలకు అనుగుణంగా సరఫరా చేస్తున్నామని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబూరా వు తెలిపారు. మండలంలోని కొమరారంలో ఏర్పాటుచేసిన యూరియా విక్రయ కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో సాగయ్యే ఆరు లక్షల ఎకరాలకు 37,300 మెట్రిక్ టన్నుల యూరి యా అవసరమని, జూన్ మొదటి వారం నుంచి ఇప్పటి వరకు 18,080 మెట్రిక్ టన్ను ల యూరియా సరఫరా అయిందని వివరించారు. ఇందులో 11,800 మెట్రి క్ టన్నులు విక్రయించగా, జిల్లాలో ప్రస్తుతం 6,200 మె.ట. యూరియా నిల్వ ఉందని, రెండు రోజుల్లో మరో 10 వేల టన్నులు దిగుమతి అవుతుందని చెప్పారు. ఈ లెక్కన ప్రస్తుత సీజన్‌లో జిల్లాకు అవసరమైన యూరియాలో 50 శాతానికి మించి రవాణా చేశామని తెలిపారు. జిల్లాలోని 23 పీఏసీఎస్‌లకు నిత్యం 40 మెట్రిక్ టన్నుల చొప్పున యూరియా రవాణా అవుతోందని, ఇల్లెందుకు అదనంగా 40 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేస్తున్నామని వివరించారు. రెండు రోజుల్లో చల్లసముద్రంలో మరో విక్రయ కేంద్రాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. గుళికల రూపంలో ఉన్న యూరియాకు బదులుగా ద్రవ రూపంలో ఉండే నానో యూరియాను వినియోగిస్తే అదనపు ప్రయోజనం ఉంటుందని, రైతులు ఆ యూరియాను పిచికారీ చేసి సత్ఫలితాలు పొందాలని సూచించారు. విక్రయ కేంద్రాల వద్ద బారులుదీరకుండా సంయమనం పాటిస్తే ప్రతీ రైతుకు అవసరమైనంత యూరియా విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు, పీఏసీఎస్ చైర్మన్ మెట్టెల కృష్ణ, డీసీసీబీ డైరెక్టర్ జనగం కోటేశ్వరరావు, ఏడీఏ లాల్‌చంద్, ఏఓ సతీష్, పీఏసీఎస్ సీఈఓ హీరాలాల్ పాల్గొన్నారు.