
ఫ్లెక్సీలు వృథా!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: స్థానిక సంస్థల ఎన్నికల ముందు రైతులకు రుణమాఫీ చేశామని ప్రచారం చేసుకునేందుకు రాష్ట్ర సర్కారు చేసిన ప్రయత్నాలకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. సరైన ప్రణాళిక లేకుండా కేవలం ప్రచారమే లక్ష్యంగా చేసిన ప్రయత్నం విఫలమైంది. ఫలితంగా కోట్లాది రూపాయల ప్రజాధనం వృథాగా మారింది. శాసనసభ సాధారణ ఎన్నికల ముందు రైతులకు రూ. రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. గెలుపొందిన తర్వాత రుణమాఫీ ఎప్పుడు చేస్తారనే ప్రశ్నలు రైతులు, ప్రతిపక్షాల నుంచి ఎదురయ్యాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెబుతూనే 2024 ఆగస్టు 15 నుంచి విడతల వారీగా రుణమాఫీ చేశారు. ఎట్టకేలకు 2024–2025 ఆర్థిక సంవత్సరం ముగింపు / ఉగాది పండగ నాటికి బ్యాంకుల్లో రుణ మాఫీ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది.
61 వేల ఫ్లెక్సీల ముద్రణ
రుణమాఫీ అమలులో అనేక కొర్రీలతో రైతులను ఇబ్బందులు పెడుతున్నారంటూ ప్రతిపక్షాలు విమర్శించాయి. మరోవైపు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వేల కోట్ల రూపాయలు రుణమాఫీ కోసం వెచ్చించామని ప్రభుత్వం చెప్పుకుంది. ఈ క్రమంలోనే ఏ గ్రామంలో ఎంత మంది రైతులకు రుణమాఫీ జరిగింది. ఎంత డబ్బులు వారి ఖాతాలో జమ చేశామనే వివరాలను బహిరంగంగా వెల్లడించేందుకు సిద్ధమైంది. లబ్ధిదారుల వివరాలతో కూడిన ఫ్లెక్సీలు ముద్రించి గ్రామాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గ్రామానికి రెండు, మూడు చొప్పున జిల్లాలోనే అరవై ఒక్క వేలకు పైగా ఫ్లెక్సీలను ముద్రించింది.
గ్రామాల్లో రుణమాఫీ వివరాలతో ఫ్లెక్సీల ఏర్పాటుకు నిర్ణయం
మాఫీకాని వారినుంచి వ్యతిరేకత
రావడంతో నిలిచిన ప్రక్రియ
జిల్లాలో రూ.18.33 లక్షల
ప్రజాధనం దుబారా!
గప్‌చుప్
రుణమాఫీ లబ్ధిదారుల వివరాలను పేర్కొంటూ మే చివరి వారం నుంచి గ్రామాల్లో ఫ్లెక్లీల ఏర్పాటు ప్రక్రియ మొదలైంది. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన చోట ఇబ్బందులు రావడం మొదలైంది. సాంకేతిక కారణాలు, వడ్డీ కారణంగా రూ.రెండు లక్షలకు మించిన రుణం ఉన్న రైతుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతి రేకత వచ్చింది. పంచాయతీ ఎన్నికలకు ముందు బ్రహ్మాస్త్రంలా పనికి వస్తుంది అనుకున్న ప్రచా రం కాస్త బూమరాంగ్ అవుతుందనే సందేహాలు ప్రభు త్వ పెద్దల్లో నెలకొన్నాయి. దీంతో ఫ్లెక్సీల ఏర్పాటును ఎక్కడిక్కడ నిలిపేశారు. అప్పటికే 220 గ్రామాల్లో ఏర్పాటు చేసినట్టు అధికార వర్గాలు చెబుతున్నా వాటిలో కూడా సింహభాగం ఫ్లెక్సీలను తొలగించారు. దీంతో ప్రింటింగ్ పూర్తి చేసుకున్న ఫ్లెక్సీలు మండల కార్యాలయాలు, గ్రామ పంచాయతీల్లో మూలన పడేశారు. ఒక్కో ఫ్లెక్సీకి సగటున రూ.350 వంతున ఖర్చు చేశారు. ఇందు కోసం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.28 కోట్లు ఖర్చు చేసినట్టు సమాచారం. జిల్లాలో రూ.18.33 లక్షల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.