
స్వర్ణ కవచధారణలో రామయ్య
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థాన అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచధారులై దర్శనమిచ్చా రు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వా మి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శుక్రవారం సందర్భంగా శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.
డీఏఓ ఆకస్మిక తనిఖీ
జూలూరుపాడు: సహకార సంఘం కార్యాలయంలోని ఎరువుల విక్రయ కేంద్రంలో శుక్రవారం జిల్లా వ్యవసాయశాఖ అధికారి వేల్పుల బాబూరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్‌ను పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడారు. నానో యూరియా, నానో డీఏపీ వాడటం వల్ల కలిగే లాభాలను వివరించారు. జిల్లాలో యూరియా కొరతలేదని, అవసరమైన మేరకే యూరియాను తీసుకోవాలని రైతులకు సూచించారు. ఏఓ దీపక్ ఆనంద్, ఏఈఓ గౌస్, సొసైటీ సెక్రటరీ రమణారెడ్డి, సిబ్బంది సాయి, అమల, సునీత, రైతులు పాల్గొన్నారు.
399 అడుగులకు
చేరిన కిన్నెరసాని
పాల్వంచరూరల్: ఎగువన కురుస్తున్న వర్షాలకు వరద వచ్చి చేరుతుంటంతో కిన్నెరసాని జలాశయం నీటిమట్టం పెరుగుతోంది. 407 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన రిజర్వాయర్‌లోకి ఎగువనుంచి 4 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో శుక్రవారం నీటిమట్టం 399 అడుగులకు చేరిందని ప్రాజెక్ట్ పర్యవేక్షణ ఇంజనీర్ తెలిపారు.
దేవాదాయ శాఖ భూముల పరిశీలన
కొత్తగూడెంటౌన్: కొత్తగూడెంలో దేవాదాయ శాఖకు సంబంధించిన భూములను శుక్రవారం ఆ శాఖ వరంగల్ జోన్ శాఖ ఉప కమిషనర్ ఽకేఎల్ సంధ్యారాణి పరిశీలించారు. తొలుత శ్రీవిజయ విఘ్నేశ్వరస్వామి దేవస్థానాన్ని సందర్శించి పూజలు చేశారు. ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించారు. ఆ తర్వాత కోర్టు వివాదంలో ఉన్న చిట్టి సత్రం, కామేశ్వరమ్మ సత్రంతో పాటు నిర్మాణంలో ఉన్న ఆర్యవైశ్య సత్రం భూములను, కొత్తగూడెం ఓల్డ్ డిపో సమీపంలోని సత్రం భూములను పరిశీలించారు. ఈఓ రజనీకుమారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మణుగూరు ఓసీ
విస్తరణకు ఆమోదం
మణుగూరు టౌన్: సింగరేణి కాలరీస్ మణుగూరు ఓసీ విస్తరణకు రామానుజవరం గ్రామస్తులు సముఖత వ్యక్తం చేశారు. శుక్రవారం గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో భూ సేకరణ ప్రత్యేకాధికారి సుమ మాట్లాడుతూ భూ నిర్వాసితులైన గిరిజనులకు, గిరిజనేతరులకు లభించే పరిహారం, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలతోపాటు ఔట్ సోర్సింగ్ ఉపాధి, టెక్నికల్ కోచింగ్ తదితర అంశాలపై వివరించారు. అనంతరం రైతుల సందేహాలను నివృత్తి చేశారు. రైతుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని మెరుగైన పరిహారం అందిస్తామని తెలిపారు. దీంతో గ్రామస్తులు సుముఖత వ్యక్తం చేస్తూ సంతకాలు చేశారు. ఓసీ విస్తరణకు సింగరేణి ఆధీనంలోని భూమి మినహా 813 ఎకరాలు అవసరం ఉండగా, ఇప్పటికే కొమ్ముగూడెం, తిర్లాపురం గ్రామాల్లో ప్రజామోదం లభించింది. తాజాగా రామానుజవరంలోనూ ఆమోదం లభించడంతో మణుగూరు ఓసీ విస్తరణకు మార్గం సుగమమైంది. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు పాల్గొన్నారు.

స్వర్ణ కవచధారణలో రామయ్య

స్వర్ణ కవచధారణలో రామయ్య