
మహిళల సమగ్రాభివృద్ధే లక్ష్యం
భద్రాచలం/కొత్తగూడెంఅర్బన్/బూర్గంపాడు: మహిళల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన బూర్గంపాడు మార్కెట్ యార్డులో, భద్రాచలం గిరిజన భవన్‌లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావులతో కలిసి పాల్గొన్నారు. పినపాక నియోజకవర్గానికి చెందిన మహిళలకు రూ 19.18 కోట్ల పావలా వడ్డీ రుణాల చెక్కులను అందజేశారు. భద్రాచలంలో 268 స్వయం సహాయక సంఘాలకు రూ.17.64కోట్లు, లోన్ బీమా ద్వారా 17మంది సభ్యులకు రూ.22.49 లక్షల చెక్కులను లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం రామాలయం చుట్టు పక్కల జరుగుతున్న మాడ వీధుల విస్తరణ పనులను పరిశీలించారు. సేకరించిన స్థలం వివరాలను రెవెన్యూ అధికారులను, దేవస్థానం ఈవోలను అడిగి తెలుసుకున్నారు. తొలుత గిరిజన్ భవన్‌లో మహిళలు తయారు చేసిన బిస్కెట్లను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డ్వాక్రా సంఘాల మహిళలకు గత ప్రభుత్వం పావలా వడ్డీ రుణాలు చెల్లించకుండా ఆర్థికంగా ఇబ్బందులు పెట్టిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ. 875 కోట్లను చెల్లించామని తెలిపారు. సభ్యుల వయో పరిమితిని 60 ఏళ్ల నుంచి 65 ఏళ్ల వరకు పెంచనున్నట్లు తెలిపారు.
వైఎస్సార్ ఆశయ స్ఫూర్తితో..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆశయ స్ఫూర్తితో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చాలని పట్టుదలతో పనిచేస్తున్నట్లు తెలిపారు. పినపాక నియోజకవర్గంలో సీతారామ ప్రాజెక్ట్‌తో 40 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. పోడు భూముల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణానికి స్థలం గుర్తించాలని కలెక్టర్‌కు సూచించారు. గోదావరి ముంపు బాధితులకు మెరక ప్రాంతంలో స్థలాలు కేటాయించి, ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాలకు అదనంగా 1500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి తగిన ప్రణాళికలను రూపొందించాలని కలెక్టర్, ఐటీడీఏ పీవో, దేవస్థానం అధికారులు, వైదిక కమిటీ సభ్యులను మంత్రి ఆదేశించారు. భద్రాచలం, పినపాక ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు కూడా మాట్లాడారు.
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుదాం
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక స్థానాల్లో గెలిపించుకుని హస్తం పార్టీ సత్తా చాటుదామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం పార్లమెంట్ సభ్యు డు రామసహాయం రఘురాం రెడ్డి పిలుపునిచ్చా రు. శుక్రవారం కొత్తగూడెంలోని విద్యానగర్ కాలనీలో ఉన్న పొంగులేటి క్యాంపు కార్యాలయంలో చుంచుపల్లి, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశాల్లో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డిని నియమించినట్లు మంత్రి ప్రకటించగా కొత్తగూడెం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఐటీడీఏ పీఓ బి.రాహుల్, సీఈఓ నాగలక్ష్మీ, డీఆర్‌డీఓ విద్యాచందన, డీఎస్‌ఓ రుక్మిణి, నాయకులు బాలసాని లక్ష్మీనారాయణ, తుళ్లూరి బ్రహ్మయ్య, ఆళ్ల మురళి, తూము చౌదరి, పెద్దబాబు, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, కంచర్ల చంద్రశేఖర్, ఎండీ.రజాక్, కార్తీక్, సీపీఐ నాయకుడు బొల్లోజు అయోధ్య పాల్గొన్నారు.
పినపాకలో 40 వేల ఎకరాలకు సీతారామ జలాలు
రామాలయ అభివృద్ధికి ప్రణాళిక
సిద్ధం చేయాలి
ఇందిర మహిళా శక్తి సంబరాల్లో
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి
పొంగులేటి శ్రీనివాసరెడ్డి