
పదును పెడతారు..
పరీక్షిస్తారు..
కరకగూడెం: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచడం, ప్రతి విద్యార్థి సామర్థ్యానికి అనుగుణంగా నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా విద్యాశాఖ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సిలబస్ పూర్తి చేయడం, పరీక్షలు నిర్వహించడం అనే సంప్రదాయ పద్ధతులకు స్వస్తి పలికి, విద్యార్థుల అభ్యసన స్థాయిలను శాసీ్త్రయంగా అంచనా వేసేందుకు 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ‘బేస్‌లైన్’ ‘మిడ్‌లైన్’ ‘ఎండ్‌లైన్’ అనే పరీక్షల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ పరీక్షల ఫలితాలను ప్రత్యేక ‘స్కూల్ ఎడ్యుకేషన్’ యాప్‌లో నమోదు చేస్తూ డేటా ఆధారిత బోధన ద్వారా విద్యార్థుల్లోని నైపుణ్యాలకు పదును పెట్టే ఈ కార్యక్రమం సర్కార్ బడుల రూపురేఖలను మార్చే దిశగా సాగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ర్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించడానికి వారి పురోగతిని పారదర్శకంగా అంచనా వేయడానికి ఈ సరికొత్త విధానం ఎంతగానో ఉపయోగపడనుంది. జిల్లా వ్యాప్తంగా 953 ప్రాథమిక, 162 ప్రాథమికోన్నత, 124 ఉన్నత పాఠశాలలు ఉండగా 46,754 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
అభ్యసన స్థాయిని నిర్ధారించడం..
ఈ మూడు దశల పరీక్షల ప్రధాన ఉద్దేశం విద్యార్థుల ప్రస్తుత అభ్యసన స్థాయిని నిర్ధారించడం, వారి పురోగతిని ట్రాక్ చేయడం, అందుకు అనుగుణంగా బోధనా పద్ధతులను సర్దుబాటు చేయడం.
●బేస్‌లైన్ పరీక్షలు: జూన్ చివరిలో ఈ పరీక్షలను ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు నిర్వహిస్తారు. ప్రాథమిక అంశాల్లో ఎంతవరకు అవగాహన కలిగి ఉన్నారో ఈ పరీక్షల ద్వారా తెలుస్తుంది.
●మిడ్‌లైన్ పరీక్షలు: నవంబర్‌లో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ఉపాధ్యాయులు అందించిన బోధన ఎంతవరకు ఫలించిందో, విద్యార్థులు ఎంత పురోగతి సాధించారో అంచనా వేయవచ్చు.
●ఎండ్‌లైన్ పరీక్షలు: విద్యా సంవత్సరం ముగింపులో ఈ పరీక్షలను నిర్వహిస్తారు. విద్యార్థి సాధించిన మొత్తం అభ్యసన స్థాయిని, నైపుణ్యాల పెంపుదలను స్పష్టంగా తెలియజేస్తుంది.
●పారదర్శకతకు పెద్దపీట
ఈ పరీక్షల ఫలితాలను ప్రత్యేక ‘స్కూల్ ఎడ్యుకేషన్’ యాప్‌లో నమోదు చేయడంతో ఫలితాలు పారదర్శకంగా ఉంటాయి. విద్యార్థుల వ్యక్తిగత పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం సులభం అవుతుంది. ఏ విద్యార్థికి ఏ అంశంలో ఎక్కువ శ్రద్ధ అవసరమో గుర్తించడానికి యాప్ డేటా సహాయపడుతుంది.
విద్యార్థుల పురోగతికి విద్యాశాఖ
కొత్త అడుగు
సామర్థ్యాలను తెలుసుకునేందుకు మూడు దశల్లో పరీక్షలు
ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నారో
గుర్తింపు
అందుకు అనుగుణంగా విద్యాబోధన
స్థాయి ఆధారంగా బోధన
పరీక్షల ఫలితాల ఆధారంగా విద్యార్థుల అభ్యసన స్థాయిని బట్టి ఉపాధ్యాయులు తమ బోధనా పద్ధతులను మార్చుకునే అవకాశం ఉంటుంది. ఒక విద్యార్థి గణితంలో వెనుకబడి ఉన్నట్లు బేస్‌లైన్ పరీక్షలో తేలితే ఆ విద్యార్థికి ప్రత్యేక శ్రద్ధతో, విభిన్న బోధనా సామగ్రితో బోధన అందిస్తారు. ఈ సమగ్ర విధానం కేవలం పరీక్షలకే పరిమితం కాకుండా, విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించడానికి ఉపయోగపడనుందని చెబుతున్నారు.
భవిష్యత్‌కు బలమైన పునాది..
రాష్ట్ర విద్యాశాఖ ప్రవేశపెట్టిన ఈ పరీక్షల విధానం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచడంలో విప్లవాత్మక మార్పు తీసుకువస్తుంది. ప్రతి విద్యార్థి అభ్యసన స్థాయిని కచ్చితంగా అంచనా వేసి వారి అవసరాలకు అనుగుణంగా బోధనను అందించడానికి ఇది మాకు సహాయపడుతుంది. ఇది విద్యార్థుల భవిష్యత్‌కు బలమైన పునాది వేస్తుంది. –నాగరాజశేఖర్,
జిల్లా అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్
ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నానో తెలిసింది
ఈ కొత్త పరీక్షలు మాకు చాలా ఉపయోగపడుతున్నాయి. బేస్‌లైన్ పరీక్ష రాసిన తర్వాత నేను ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నానో తెలిసింది. టీచర్లు కూడా మాకు అర్థం కాని విషయాలను మళ్లీ చెబుతున్నారు. పరీక్షలు పెట్టడం వల్ల మేము ఎక్కడ ఉన్నామో తెలుస్తోంది. బాగా చదువుకోవడానికి ప్రోత్సాహంగా ఉంది.
–పి.సుశాంత్, 9వ తరగతి, భట్టుపల్లి జెడ్పీహెచ్‌ఎస్

పదును పెడతారు..

పదును పెడతారు..