
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
నేడు దమ్మక్క సేవా యాత్ర
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో గురువారం దమ్మక్క సేవా యాత్ర నిర్వహించనున్నట్లు ఆలయ ఆధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆషాఢ శుద్ధ పూర్ణిమ సందర్భంగా నేడు ఉదయం 10 గంటలకు గిరిజన పెద్దలు, కళాకారుల నృత్యాల నడుమ దమ్మక్క సేవా యాత్ర సాగుతుందని వివరించారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా వెంకటాపురంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో భద్రాద్రి శ్రీసీతారాముల కల్యాణం నిర్వహించనున్నుట్లు పేర్కొన్నారు.
బీఈడీలో ప్రవేశానికి
దరఖాస్తుల ఆహ్వానం
భద్రాచలంటౌన్: భద్రాచలంలోని గిరిజన బీఈడీ కళాశాలలో రెగ్యులర్ బీఈడీ కోర్సు(2025–27)లో ప్రవేశానికి ఏజెన్సీ షెడ్యూల్ ప్రాంత గిరిజన పట్టభద్రుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. డిగ్రీ కనీసం 40శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన తెలంగాణలోని గిరిజన అభ్యర్థులు అర్హులని, డిగ్రీ మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుందని వెల్లడించారు. మొత్తం 100 సీట్లలో మహిళలు, ప్రత్యేక కేటగిరీ వారికి రిజర్వేషన్ ఉంటుందని తెలిపారు. ఏటూరునాగారం, ఉట్నూరు, మన్ననూరు ఐటీడీఏ కార్యాలయాలతో పాటు భద్రాచలం గిరిజన బీఈడీ కళాశాలలో దరఖాస్తులు తీసుకుని, ఆగస్టు 8వ తేదీ వరకు అందజేయాలని, వివరాలకు 89784 77345 నంబర్‌లో సంప్రదించాలని పీఓ సూచించారు.
సింగరేణిలో ఏడుగురు సివిల్ అధికారుల బదిలీ
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణిలో ఏడుగురు సివిల్ అధికారులను బదిలీ చేస్తూ ఈఈ సెల్ హెచ్‌ఓడీ ఏజే మురళీధర్ రావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్టీపీపీ డీజీఎం జి.శివప్రసాద్‌ను మణుగూరు డీజీఎంగా, కార్పొరేట్ విజిలెన్స్ డీజీఎం జి.రాంచందర్‌ను ఎస్టీపీపీ డీజీఎంగా, మణుగూరు ఏరియా ఎస్‌ఈ బీవీఎన్ పాత్రుడును ఎస్టీపీపీకి, ఆర్జీ–3 ఏరియా ఎస్‌ఈ పి.రాజేంద్రప్రసాద్‌ను కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాకు, కార్పొరేట్ సివిల్ హెచ్‌ఓడీ (డివైఎస్‌ఈ) శ్రీనాథ్‌ను విజిలెన్స్ కార్పొరేట్‌కు, కార్పొరేట్ సివిల్ హెచ్‌ఓడీ(ఏఈ) పప్పి ప్రజ్వలను ఇల్లెందు ఏరియాకు, కార్పొరేట్ ఏరియా మేనేజ్‌మెంట్ ట్రైనీ రామ్‌చరణ్‌ను మణుగూరు ఏరియాకు బదిలీ చేశారు. వీరంతా ఈనెల ఈనెల 15వ తేదీ లోగా ఆయా స్థానాల్లో చేరాలని పేర్కొన్నారు.

నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం