
పరిశ్రమల ఊసేది?
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తక్కువ పెట్టుబడితో ఎక్కువ మందికి జీవనోపాధి కల్పించే చిన్న, మధ్య తరహా పరిశ్రమల జాడ జిల్లాలో అంతంతగానే ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతో గర్వంగా చెప్పుకున్న నూతన పారిశ్రామిక విధానం – టీఎస్ ఐ పాస్ ద్వారా లేదంటే ప్రస్తుత ‘ప్రజాపాలన’లో కానీ జిల్లాకు చెప్పుకోదగ్గ చిన్న, మధ్య తరహా పరిశ్రమలు రాలేదు.
అప్పట్లో హడావిడి..
ప్రతీ నియోజకవర్గంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు స్థాపించాలని గత ప్రభుత్వ హయాంలో లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే భద్రాచలం, కొత్తగూడెం నియోజకవర్గాల పరిధిలో అవసరమైన ప్రభుత్వ స్థలాలు లేవని తేల్చేశారు. మిగిలిన మూడు నియోజకవర్గాలకు సంబంధించి ఇల్లెందు మండలం లచ్చగూడెం, అశ్వాపురం మండలం గొందిగూడెం, అశ్వారావుపేట మండలం తిరుమలకుంట పరిధిలో ప్రభుత్వ స్థలాలను గుర్తించారు. కానీ ఆ తర్వాత ఈ అంశంలో అడుగు ముందుకు పడలేదు. దీనిపై రాజకీయ నాయకుల నుంచి చొరవ లేకపోవడం, జిల్లా అధికారుల వైపున క్రియాశీలత లోపించడంతో కొత్త పరిశ్రమల స్థాపన ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్నట్టుగా మారింది. ఈ అంశం తెరపైకి వచ్చినప్పుడల్లా అనువైన స్థలాలు, బ్యాంకు రుణాలు లేవంటూ కాలం గడుపుతున్నారు.
రుణాలు వచ్చేది ఎలా?
సారపాక ఐటీసీ, పేపర్ పరిశ్రమ నుంచి వెలువడే కలప గుజ్జు ఆధారంగా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామ పంచాయతీ(1/70 పరిధిలో లేదు)లో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు అనేకం వెలిశాయి. ఇదే తరహాలో సింగరేణి, థర్మల్ పవర్ ప్లాంట్ వంటి భారీ పరిశ్రమలకు అనుబంధంగా మధ్య, చిన్న, కుటీర తరహా పరిశ్రమలు ఇక్కడ నెలకొల్పే అవకాశముంది. వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ, ప్రాసెసింగ్ పరిశ్రమలు స్థాపించే వీలుంది. అయితే జిల్లాలో అత్యధిక ప్రాంతం 1/70 చట్టం పరిధిలో ఉండడంతో పరిశ్రమల స్థాపన అవసరమయ్యే మూలధనం సమకూర్చుకునే విషయంలో ఇబ్బందులు ఉన్నాయి. ఈ చట్టం పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో రుణాల మంజూరుకు బ్యాంకులు ససేమిరా అంటున్నాయి. ఈ సమస్యకు పరిష్కారం చూపే దిశగా ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదు.
గిరిజన ప్రణాళిక కావాలి..
ఏజెన్సీ జిల్లాలో పరిస్థితులు, వెనుకబాటుతనంతో పాటు ఇక్కడ అమల్లో ఉండే చట్టాలను అనుసరించి పారిశ్రామిక అభివృద్ధికి సరికొత్త ప్రణాళికలు అమలు చేయాల్సిన అవసరముంది. జిల్లాలో ఉన్న సహజ వనరులు, ఇప్పటికే విజయవంతంగా నడుస్తున్న పరిశ్రమలు, ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను దృష్ట్యా ఇక్కడ ఏ పరిశ్రమలు స్థాపించవచ్చనే అంశంపై రోడ్‌మ్యాప్ సిద్ధం చేయాలి. అలాగే నెలకొల్పబోయే పరిశ్రమలకు అవసరమైన మూలధనం సమకూర్చేందుకు ఐటీడీఏతో పాటు గిరిజన సంక్షేమ శాఖలు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి. ఇవేమీ లేకుండా మైదాన ప్రాంతాలకు అన్వయించే విధానాలనే వెనుకబాటు తనం, ప్రత్యేక సంస్కృతి, జీవన విధానం ఉండే ఏజెన్సీ ప్రాంతంలో కూడా అమలు చేయడం సబబు కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇన్నాళ్లూ ఇలా చేయడం వల్లే జిల్లాలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కనీస స్థాయిలో కూడా లేకుండా పోయాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
జాడలేని చిన్న, మధ్య తరహా ఫ్యాక్టరీలు
మైదాన ప్రాంతాల్లో ఏర్పాటుకు స్థలాలు కరువు
ఏజెన్సీ ఏరియాలో అందని బ్యాంకు రుణాలు
జిల్లాలో మందకొడిగా పారిశ్రామిక పురోగతి
నిరుపయోగంగా స్థలాలు..
కొత్తగూడెం నగర నడిబొడ్డున వందల ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కును దశాబ్దాల క్రితం ఏర్పాటు చేశారు. ఈ స్థలంలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామంటూ గతంలో అనేక మంది లీజుకు తీసుకున్నారు. కొందరు తూతూ మంత్రంగా యూనిట్లు స్థాపించి ఆ తర్వాత మూలన పడేశారు. ఇక జిల్లా కేంద్రం పరిధిలోని రామవరంలో బేరియం ఫ్యాక్టరీ స్థలం నిరుపయోగంగా మారి దట్టమైన అడవిని తలపిస్తోంది. పరిశ్రమల కోసం పక్కన పెట్టి, ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న భూముల లెక్క తీస్తే జిల్లా కేంద్రంలోనే కొత్త పరిశ్రమలకు అవసరమైనంత స్థలం అందుబాటులోకి వస్తుంది. ఇక్కడైతే బ్యాంకు రుణాలకు ఇబ్బంది ఉండదు. అయితే ఈ అంశాన్ని కనీసం పట్టించుకునే వారు లేరు.