
నానో యూరియాతో సత్ఫలితాలు
ఇల్లెందురూరల్: సత్వర ప్రయోజనం అందించే నానో యూరియా వినియోగంపై రైతులు అవగాహన పెంచుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబూరావు సూచించారు. ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ యార్డులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న యూరియా విక్రయ కేంద్రాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. ఇప్పటివరకు ఇల్లెందుకు చేరిన యూరియా, విక్రయం, ప్రస్తుతం ఉన్న నిల్వల వివరాలు తెలుసుకున్నారు. విక్రయ కేంద్రం వద్ద ఉన్న రైతులతో మాట్లాడారు. జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో లక్ష ఎకరాల వరకు మొక్కజొన్న సాగయ్యే అవకాశం ఉందన్నారు. జిల్లాలో యూరియా నిల్వలు సరిపడా ఉన్నాయని, రోజూ 40 టన్నుల యూరియా ఇల్లెందుకు రవాణా అవుతోందని తెలిపారు. నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీసీవో శ్రీనివాస్, ఏడీఏ లాల్‌చంద్, ఏవో సతీష్, పీఏసీఎస్ సీఈవో హీరాలాల్, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబూరావు