
సీలింగ్ భూముల స్వాధీనం
ఖమ్మంఅర్బన్: సీలింగ్ భూములను లబ్ధిదారులు సాగు చేసుకోకుండా ఇతరులకు అమ్ముకున్నట్లు తేలడంతో స్వాధీనం చేసుకోవడంపై అధికారులు దృష్టి సారించారు. ఈమేరకు ఖమ్మం అర్బన్ మండలం మల్లెమడుగు గ్రామంలో సర్వే నంబర్ 196లో ఉన్న 9.9 ఎకరాల భూమిని కోర్టు ఆదేశాలతో గురువారం ఖమ్మం అర్బన్ ఆర్‌ఐ వాహిద్, సర్వేయర్ నాగేశ్వరరావు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డు ఏర్పాటుచేశారు. ఈ భూమి విలువ సుమారు రూ.50 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
నిబంధనల ఉల్లంఘనతో..
సర్వేనంబర్ 196లోని భూములను గతంలో ఇద్దరు రైతులకు అసైన్‌మెంట్ రూపంలో కేటాయించారు. అయితే, స్వయంగా సాగు చేసుకోవాలే తప్ప విక్రయించొద్దనే నిబంధన విధించారు. కానీ వారిద్దరు ఇతరులకు అమ్మగా.. ఆపై ఇంకొన్ని చేతులు మారినట్లు తేలింది. ఈనేపథ్యాన కోర్టు సూచనల మేరకు 9.9 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నామని తహసీల్దార్ సైదులు తెలిపారు. ఈ భూమిని ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలని నిర్ణయించగా, ఎవరూ ఆక్రమించకుండా హెచ్చరిక బోర్డు ఏర్పాటుచేశారు.
ఇతరులకు అమ్మినట్లు తేలడంతో
చర్యలు
స్వాధీనం చేసుకున్న
భూమి విలువ రూ.50కోట్లు!
ప్లాట్ల యజమానుల్లో ఆందోళన
సీలింగ్ భూములు తీసుకున్న వారు సాగు చేయకపోవడమే కాక ఇతరులకు విక్రయించారు. ఆపై చేతులు మారగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు దక్కించుకుని ప్లాట్లుగా విడగొట్టి 80 మందికి విక్రయించినట్టు తెలిసింది. నిబంధనలు ఉల్లంఘించారని అధికారులు కోర్టును ఆశ్రయించగా, కోర్టు ఉత్తర్వులతో స్వాధీనం చేసుకోవడంతో విషయం తెలియక ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఆందోళన చెందుతున్నారు. అధికారులు భూమిని స్వాధీనం చేసుకున్నట్లు తెలియగానే పలువురు అక్కడకు చేరుకుని డాక్యుమెంట్ల ఆధారంగా పరిశీలించడం కనిపించింది.