
బైక్ పల్టీ.. ఎఫ్‌బీఓకు గాయాలు
ములకలపల్లి: ద్విచక్ర వాహనం పల్టీ కొట్టిన ఘటనలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (ఎఫ్‌బీఓ) శంకర్ తీవ్రంగా గాయపడ్డారు. మండలంలోని ముత్యాలంపాడు బీట్ ఎఫ్‌బీఓగా విధులు నిర్వర్తిస్తున్న శంకర్.. పని ముగించుకుని ములకలపల్లి వైపు వస్తున్నాడు. ముత్యాలంపాడు క్రాస్‌రోడ్డు సమీపంలో అకస్మాత్తుగా కోతులు అడ్డురాడంతో బైక్ అదుపుతప్పి కిందపడ్డాడు. శంకర్ తల, కాళ్లు, చేతులకు బలమైన గాయాలవగా.. స్థానికులు ఆటోలో మంగపేట పీహెచ్‌సీలో ప్రాథమిక చికిత్స నిర్వహించి, పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
పెనగడపలోని రైతు ఇంట్లో చోరీ..
కొత్తగూడెంటౌన్: తెల్లవారుజామున ఓ రైతు ఇంట్లోకి చొరబడిన దుండగులు 25 గ్రాముల బంగారం, రూ. 1.25 లక్షల నగదును అపహరించిన ఘటన శుక్రవారం రామవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. టూ టౌన్ సీఐ ప్రతాప్ కథనం ప్రకారం.. పెనగడప గ్రామంలో నివాసం ఉంటున్న రైతు ఎస్‌కే అబ్బాస్.. తన ఇంటి సమీపంలోనే కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. తెల్లవారుజామున దుకాణం తెరిచేందుకు వెళ్లగా కిటికి తెరిచి ఉండటం గమనించాడు. లోపలికి వెళ్లి చూడగా.. బీరువా తాళం పగులగొట్టి 20 గ్రాముల బంగారం, 5 గ్రాముల బంగారు ఉంగరంతో పాటు రూ.1.25 లక్షల నగదు చోరీ చేసినట్లు గుర్తించాడు. టూటౌన్ పోలీసులకు సమాచారం అందించగా.. వారు క్లూస్ టీంతో వచ్చి వివరాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రతాప్ తెలిపారు.
సింగరేణిలో ఆరుగురు సర్వే ఆఫీసర్ల బదిలీ
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి వివిధ ఏరియాల్లో పనిచేస్తున్న ఆరుగురు సర్వే ఆఫీసర్లను బదిలీ చేస్తూ కార్పొరేట్ ఈఈ సెల్ హెచ్‌ఓడీ మురళీధర్‌రావు శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. వారిలో ఒక సర్వే ఆఫీసర్, ఐదు గురు జూనియర్ సర్వే ఆఫీసర్లు ఉన్నారు. వీరంతా జూలై 5వ తేదీలోపు కేటాయించిన ఏరియా ల్లో విధుల్లో చేరాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
రూ.1.25 లక్షల నగదు, 25 గ్రాములు బంగారం అపహరణ