
ప్రతీ నీటి బొట్టును ఒడిసిపట్టాలి
సుజాతనగర్: ప్రతీ నీటి బొట్టును ఒడిసిపట్టాలని, అందుకోసం ప్రతి ఇంట్లో ఇంకుడుగుంతను నిర్మించుకోవాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జలశక్తి అభియాన్‌లో భాగంగా సర్వారం గ్రామ పంచాయతీ, హలావత్ తండాలో పలువురు నిరిస్తున్న ఇంకుడుగుంతల పనులను బుధవారం ఆయన పరిశీలించారు. పలుగు పార పట్టి ఇంకుడు గుంత తవ్వారు. అనంతరం మాట్లాడుతూ.. ఇంకుడు గుంతల నిర్మాణానికి వేసవి కాలమే సరైన సమయమని అన్నారు. ఇంకుడు గుంతల నిర్మాణాలతో భూగర్భ జలాలు సమృద్ధిగా పెరుగుతాయని తెలిపారు. పనులు ఎలా సాగుతున్నాయంటూ పంచాయతీ కార్యదర్శి సతీష్‌ను అడిగి తెలుసుకున్నారు. ఇంకుడు గుంతల నిర్మాణాలకు ముందుకొచ్చిన యువకులను కలెక్టర్ అభినందించారు.