భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారికి శనివారం సువర్ణ తులసీ అర్చన నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
శాంతి నెలకొనాలని యాగం
భారత్ – పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగాలని, దేశంలో శాంతి నెలకొనాలని ఆకాంక్షిస్తూ ఆలయంలో వేద పండితులు శనివారం శాంతి యాగం నిర్వహించారు. అనంతరం గోశాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఈఓ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
నరసింహస్వామి కల్యాణ వేడుకలకు అంకురార్పణ
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీ లక్ష్మీనర్సింహస్వామివారి ఆలయంలో నిర్వహించే కల్యాణ మహోత్సవాలకు శనివారం అంకురార్పణ చేశారు. ఉత్సవాల్లో భాగంగా వేద పండితులు ధ్వజ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని శాస్త్రోత్తంగా జరిపించారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక అభిషేకం, పూజలు నిర్వహించారు.
జాతీయ రక్షణ నిధికి నెల వేతనం విరాళం
మణుగూరు టౌన్: జాతీయ రక్షణ నిధికి ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తున్న సైనికుల కోసం విరాళం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఉగ్రవాదులు దేశంలోకి చొరబడకుండా కాపాడుతున్న సాయుధ దళాలకు అందరూ మద్దతు ప్రకటించాలని కోరారు. తద్వారా వారిలో మనోస్థైర్యం పెరుగుతుందన్నారు.

రామయ్యకు సువర్ణ తులసీ అర్చన