
వ్యవసాయ వ్యాపారులుగా ఎదగాలి
● ఉద్యోగం కోసం ప్రయత్నించకుండా ఉపాధి కల్పకులుగా మారాలి ● కలెక్టర్ జితేష్ వి పాటిల్
అశ్వారావుపేట: వ్యవసాయ విద్యార్థులు భావి వ్యవసాయ అనుబంధ వ్యాపారులుగా ఎదగాలని, ఉద్యోగం కోసం ప్రయత్నించకుండా పలువురికి ఉపాధి కల్పించేవారుగా మారాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. స్థానిక వ్యవసాయ కళాశాలలో సాగువుతున్న మామిడి, మునగ, ఇతర ఉద్యాన పంటలు, జరుగుతున్న పరిశోధనలను మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ.. వ్యవసాయ విద్య అభ్యసించిన తర్వాత ఉద్యోగాన్వేషణ చేయకుండా వ్యవసాయ ఆధారిత పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారులుగా ఎదగాలని సూచించారు. తద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పించే అవకాశం లభిస్తుందన్నారు. విద్యాభ్యాసంలో భాగంగా గ్రామాల్లో రైతులను కలిసి సూచనలు చేయడమే కాక వారి అనుభవాల నుంచి కూడా పాఠాలు నేర్చుకోవాలన్నారు.
అర్హులకు భూ భారతి పట్టాలు
అశ్వారావుపేట రెవెన్యూ 911, కన్నాయిగూడెం రెవెన్యూ 152 సర్వే నంబర్లలో అర్హులకు భూ భారతి చట్టం ప్రకారం నూతన పట్టాలు జారీ చేస్తామని కలెక్టర్ అన్నారు. జాయింట్ సర్వే ద్వారా సమస్యల పరిష్కరిస్తామని చెప్పారు. ఆ తర్వాత గోగులపూడిలో వెదురు కళాకృతుల తయారీదారులతో మాట్లాడి.. వారి ఆర్థిక అభ్యున్నతికి శిక్షణ, ఇతర సౌకర్యాల కల్పనకు ప్రయత్నిస్తామని అన్నారు. అనంతరం గుబ్బలమంగమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్ కృష్ణప్రసాద్, ఏడీఏ రవికుమార్, ఏఓ శివరామప్రసాద్, ఎంపీడీఓ ప్రవీణ్‌కుమార్, నాయబ్ తహసీల్దార్ సీహెచ్‌వీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
వారం లోగా ఇంకుడు గుంతలు పూర్తవ్వాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వారం రోజుల్లోగా ఇంకుడుగుంతల నిర్మాణాలు పూర్తి చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్ నుంచి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులు, విద్యాసంస్థల్లో ఇంకుడుగుంతలు నిర్మించాలన్నారు. వర్షపు నీరు ఎక్కువగా నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి అక్కడే నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. పనులు పూర్తయ్యాక జల్ సంచెయ్ జెన్ భాగీ దారి పోర్టల్‌లో పంచాయతీ కార్యదర్శులతో అప్‌లోడ్ చేయించాలని చెప్పారు. వ్యవసాయ భూముల్లోనూ నిర్మాణాలకు మార్కింగ్ చేయాలని సూచించారు. ఉపాధిహామీ పథకం ద్వారా ఉచితంగా నిర్మాణాలు చేపడతామని, ఈ మేరకు రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు డి వేణుగోపాల్, విద్యాచందన పాల్గొన్నారు.
పోలీస్‌స్టేషన్ సందర్శన..
ములకలపల్లి : ములకలపల్లి పోలీస్‌స్టేషన్‌ను కలెక్టర్ పాటిల్ మంగళవారం సందర్శించారు. స్టేషన్ ఆవరణలో చేపట్టిన ఇంకుడుగుంతల నిర్మాణాలను పరిశీలించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్యశాలలు, హెల్త్ సబ్‌సెంటర్లు, పోలీస్‌స్టేషన్లలో టాయిలెట్లు నిర్మిస్తామని తెలిపారు. పీహెచ్‌సీని సందర్శించి ఆశా వర్కర్ల పనితీరును కలెక్టర్ అభినందించారు. ఆస్పత్రి చుట్టూ ప్రహరీని వారం రోజుల్లో పూర్తి చేయాలని ఎంపీడీఓ గద్దె రేవతిని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ విద్యాచందన, డీఎంఅండ్‌హెచ్‌ఓ భాస్కర్‌నాయక్, ఎంఈఓ సత్యనారాయణ, డాక్టర్లు సాయికల్యాణ్, కృష్ణదీపక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.