
34 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
కొత్తగూడెంటౌన్: ఏపీ నుంచి ఛత్తీస్‌గఢ్‌కు తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని కొత్తగూడెంలో పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో సీఐ కరుణాకర్ వివరాలు వెల్లడించారు. రైటర్‌బస్తీలో ఎస్‌ఐ విజయలక్ష్మి సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. అటుగా వచ్చిన లారీని ఆపి తనిఖీ చేయగా.. రేషన్ బియ్యం దొరికాయి. రూ.12.36 లక్షల విలువైన 687 బస్తాల్లోని 34 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఛత్తీస్‌గఢ్‌కు తరలిస్తున్నామని ఏపీలోని ఏలూరు జిల్లా చింతలపూడికి చెందిన చప్పిడి వెంకటకృష్ణ, లింగపాలెంకు చెందిన చల్లాగుల రామ్మోహన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం గరియాబాద్ జిల్లా రాజీం మండలం జెంజ్రా గ్రామానికి చెందిన భువనేశ్వర్ సాహు, అదే మండలానికి చిత్తరంజన్ తారక్‌లు విచారణలో తెలిపారు. ఆ నలుగురిని అదుపులోకి తీసుకున్నామని, ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన చిట్టెల రమకనకాచారి, నాగరాజు (డ్రైవర్), పరమ్ ప్రీత్‌సింగ్ (లారీఓనర్), కృతిక గోస్వామి పరారీలో ఉన్నారని సీఐ తెలిపారు. ఈ ఎనిమిది మందిపై కేసు నమోదు చేశామని సీఐ ఎం.కరుణాకర్ తెలిపారు.