
లెక్కలు కాదు.. మొక్కలు
గతంలో శాఖల వారీగా హరితహారం లక్ష్యాలు
● ఈసారి ఒక్కో శాఖకు ఒక్కో రకం మొక్కల కేటాయింపు ● తాటి, సుబాబుల్, వెదురు వంటి వాటికి ప్రాధాన్యత ● వినూత్న రీతిలో ప్రయత్నిస్తున్న కలెక్టర్ పాటిల్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణలో అడవులు, పచ్చదనం పెంచేందుకు గత పదేళ్లుగా హరిత హారం, వన మహోత్సవం పేరుతో ప్రత్యేకంగా మొక్కలు నాటుతున్నారు. ప్రారంభంలో ఈ కార్యక్రమం ప్రణాళియుతంగా సాగినా.. ఆ తర్వాత మొక్కుబడిగా మిగిలిపోయిందనే విమర్శలు వచ్చాయి. అయితే పదేళ్ల తర్వాత ఈ కార్యక్రమాన్ని సరికొత్త పంథాలో తీసుకెళ్లేందుకు కలెక్టర్ జితేశ్ పాటిల్ ప్రయత్నాలు మొదలెట్టారు.
శాఖల వారీగా..
ఈ ఏడాది వన మహోత్సవంలో భాగంగా జిల్లాలో 70 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించిన కలెక్టర్.. ఈ మేరకు శాఖల వారీగా ఎన్ని మొక్కలు నాటాలనే అంశంపై కూడా స్పష్టత ఇచ్చారు. అత్యధికంగా గ్రామీణాభివృద్ధి శాఖకు 30 లక్షల మొక్కలు లక్ష్యంగా నిర్దేశించగా తెలంగాణ అటవీ అభివృద్ధి శాఖకు 12 లక్షలు, సింగరేణికి 10 లక్షలు, అటవీ శాఖకు 10 లక్షల చొప్పున కేటాయించారు. ఇంకా ఇతర విభాగాలకు కూడా లక్ష్యాలను నిర్ణయించారు. గత పదేళ్లుగా ఇదే తరహాలో మొక్కలు పెంపకంపై ప్రణాళికలు ఘనంగా కనిపించినా వాటి తాలూకు ప్రయోజనాలు క్షేత్రస్థాయిలో అంతగా కనిపించడం లేదు. నాటిన మొక్కలను కాపాడలేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. అయితే ఈ పరిస్థితిలో మార్పు తెచ్చి జవాబుదారీతనం పెంచే ప్రయత్నం ఈసారి జరుగుతోంది.
వెదురు యాక్షన్ ప్లాన్..
రాష్ట్రంలో అడవులు ఎక్కువగా విస్తరించిన జిల్లాగా భద్రాద్రికి గుర్తింపు ఉంది. కానీ ఇక్కడ ఆశించిన స్థాయిలో వెదురు వనాలు లేవు. వెదురుతో ఫర్నిచర్ తయారు చేసే నైపుణ్యం గలవారు జిల్లాలో ఉన్నా ముడి వెదురు ఆశించిన స్థాయిలో లభించడం లేదు. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు వీలుగా వెదురు మొక్కలు నాటే కార్యక్రమాన్ని అటవీ శాఖకే కేటాయించారు. దీంతో అడవి చిక్కబడటంతో పాటు వృత్తి నైపుణ్యం గల వారికి ఉపాధి లభిస్తుంది. అంతేకాక.. జిల్లాలో చేపట్టాలని ఆశిస్తున్న సమ్మిళిత సాగుకు వెదురు వనాల పెంపకం తోడ్పాటును అందించనుంది. ఇదే తరహాలో సాగునీటి కాల్వల వెంట వట్టివేర్లు, సుబాబుల్ వంటి మొక్కల పెంపకానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఈ ప్రయోగం ఆశించిన ఫలితాలు ఇస్తే ఇతర జిల్లాలకు భద్రాద్రి ఆదర్శంగా నిలిచే అవకాశముంది.