
రామయ్యకు ముత్తంగి అలంకరణ
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
రేపు పొంగులేటి పర్యటన
దుమ్ముగూడెం : మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపనకు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం హాజరు కానున్నారని తెలిసింది. చిన్నబండిరేవులో ఇందిరమ్మ ఇళ్లు, సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన, ఎంపీడీఓ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పత్రాల పంపిణీ, సింగవరం – ఎన్ లక్ష్మీపురం గ్రామాల మధ్య పెద్దవాగుపై బ్రిడ్జి నిర్మాణ పనుల శంకుస్థాపన, కె దంతెనం పంచాయతీలో గ్రామ పంచాయతీ కార్యాలయానికి ప్రారంభోత్సవం చేస్తారని సమాచారం. అయితే మంత్రి పర్యటనపై ఇప్పటివరకు అధికారికంగా ప్రకటన వెలువడలేదు.
జూన్ 9 నుంచి
లోక్ అదాలత్
జిల్లా జడ్జి పాటిల్ వసంత్ వెల్లడి
కొత్తగూడెంటౌన్: జూన్ 9 నుంచి 14 వరకు జరిగే లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ ఒక ప్రకటనలో సూచించారు. ఈ క్రమంలో సోమవారం నుంచి ఈనెల 19 వరకు అన్ని కోర్టులో ముందస్తు లోక్ అదాలత్‌లు నిర్వహిస్తున్నామని తెలిపారు. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు, ఇతరులు వేసిన చెక్‌బౌన్స్ కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు.
ప్రియదర్శిని మరణం తీరని లోటు
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి ఎంజీ ప్రియదర్శిని మరణం తీరని లోటని జిల్లా జడ్జి పాటిల్ వసంత్ అన్నారు. జిల్లా కోర్టులో సోమవారం నిర్వహించిన సంతాపసభలో ఆయన మాట్లాడారు. 2008లో జిల్లా జడ్జిగా సేవలు ప్రారంభించి, పలు జిల్లాల్లో విధులు నిర్వహించారని తెలిపారు. 2022లో హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారని, న్యాయ వ్యవస్థకు ఆమె వినూత్న సేవలు అందించారని కొనియాడారు. అంతకుముందు ప్రియదర్శిని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు జడ్జి ఎస్,సరిత, సీనియర్ సివిల్ జడ్జి కె.కిరణ్‌కుమార్, అదనపు సివిల్ జడ్జి కె.కవిత, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.రాజేందర్, కొత్తగూడెం స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజమల్లు, జూనియర్ సివిల్ జడ్జీలు సుచరిత, కె.సాయిశ్రీ, బి.రవికుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు జె.గోపికృష్ణ, ప్రధాన కార్యదర్శి భాగం మాధవరావు, సహాయ కార్యదర్శి కాసాని రమేష్, కోశాధికారి కె.చిన్నికృష్ణ, మహిళా కార్యదర్శి ఆడపాల పార్వతి, క్రీడల కార్యదర్శి ఉప్పు ఆరుణ్, గ్రంథాలయ కార్యదర్శి మాలోతు ప్రసాద్ పాల్గొన్నారు.
విధుల్లో అప్రమత్తంగా
ఉండాలి
పాల్వంచ: విద్యుత్ ఉద్యోగులు విధుల్లో అప్రమత్తంగా ఉండాలని ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ మహేందర్ అన్నారు. భద్రతా వారోత్సవాల్లో భాగంగా సోమవారం స్థానిక అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉద్యోగులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ ఉద్యోగులు ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తుంటారని, ఈ క్రమంలో తగిన జాగ్రత్తలు అవసరమని సూచించారు. ఐఎస్‌ఐ ప్రమాణాలు గల రక్షణ పరికరాలనే వినియోగించాలని చెప్పారు. కార్యక్రమంలో డీఈ నందయ్య, ఏడీఈ హుస్సేన్, ఏఈలు మధు, ప్రతాప్, నరేష్, రవీందర్ పాల్గొన్నారు.

రామయ్యకు ముత్తంగి అలంకరణ