
ఇందిరమ్మ ఇళ్ల కోసం నిరసన
అన్నపురెడ్డిపల్లి (చండ్రుగొండ) : ఇందిరమ్మ ఇళ్లు అర్హులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అన్నపురెడ్డిపల్లిలోని ప్రధాన రోడ్డుపై గురువారం పేదలు రాస్తారోకో చేశారు. రోడ్డుకు అడ్డంగా రాళ్లు పెట్టి నిరసన తెలిపారు. అనర్హులను జాబితా నుంచి తొలగించి అర్హులకే ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళనకారులను శాంతింపచేశారు. వెంకటేష్,, లావణ్య, మరియరాజు, గోపులు, సుజాత పాల్గొన్నారు.
వ్యక్తి ఆత్మహత్య
టేకులపల్లి: అనారోగ్యంతో మనోవేదనకు గురై ఓ వ్యక్తి గురువారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. టేకులపల్లి ఎస్‌ఐ రాజేందర్ కథనం ప్రకారం.. మండలంలోని బొమ్మనపల్లి గ్రామానికి చెందిన నారందాస్ వెంకటేశ్వర్లు(55) ట్రాక్టర్ నడుపుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు. ఏడాది నుంచి పెరాలసిస్ వ్యాధితో బాధ పడుతున్నాడు. దీంతో మనస్తాపం చెంది గురువారం ఇంటి సమీపంలోని మోట బావి వద్దకు వెళ్లి కర్రకు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య స్వరూప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
వ్యక్తిపై కేసు నమోదు
భద్రాచలంటౌన్: మహిళను కారుతో ఢీకొట్టిన వ్యక్తిపై గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. గత నెల 14న కరీంనగర్‌కు చెందిన అమరగుండ లక్ష్మి బంధువులతో కలిసి భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి దర్శనానికి వచ్చింది. దర్శనం అనంతరం ఉత్తర ద్వారం సమీపంలో రోడ్డు పక్కన పడుకోగా ఆమె చేతిపై నుంచి ప్రశాంత్ అనే వ్యక్తి కారు పోనివ్వడంతో తీవ్ర గాయమైంది. వైద్య ఖర్చులు భరిస్తానని కారు యజమాని భరోసా ఇవ్వడంతో ఆమె కరీంనగర్ వెళ్లిపోయింది. ఆ తర్వాత కారు యజమాని ప్రశాంత్ బాధితురాలి గురించి పట్టించుకోకపోవడంతో ఆమె కుమారుడు హరీష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఏఎస్‌ఐ వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అన్నదమ్ములపై..
అన్నదమ్ములపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పట్టణంలోని భూపతిరావు కాలనీకి చెందిన కుర్రి సాంబశివరావు, రాములు ఆస్తి విషయంలో గొడవపడి కొట్టుకున్నారు. దీంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. పరస్పరం ఫిర్యాదు చేసుకోగా ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు.
వేధింపుల కేసు..
ఇల్లెందు: ఇల్లెందు పోలీసులు గురువారం వేధింపుల కేసు నమోదు చేశారు. మండలంలోని రైటర్ బస్తీకి చెందిన స్పందన రోజీకి హన్మకొండకు చెందిన తిక్క దీపక్‌తో 2012లో వివాహం జరిగింది. కొంతకాలంగా భర్తతోపాటు అత్తామామలు అదనపు కట్నం కోసం స్పందనను వేధిస్తున్నారు. దీంతో బాధితురాలు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సీఐ బత్తుల సత్యనారాయణ తెలిపారు.
సూపర్‌వైజర్‌ను
హతమార్చిన మావోలు
చర్ల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు మరో దారుణానికి ఒడిగట్టారు. బలరాంపూర్ జిల్లా సరిహద్దు ప్రాంతంలోని జార్ఖండ్‌లో రోడ్డు నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న సూపర్‌వైజర్‌ను గురువారం కాల్చి చంపారు. ముహువాడ పోలీస్ స్టేషన్ పరిధి ఓర్సాపత్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకోగా, సూపర్‌వైజర్‌ను కాల్చి చంపడమే కాక జేసీబీని దగ్ధం చేశారు. కొన్నాళ్ల క్రితం రోడ్డు పనులు నిలిపివేయాలంటూ మావోయిస్టులు హెచ్చరించగా, భద్రతా బలగాల నడుమ పనులు చేస్తున్నారు. దీంతో సూపర్‌వైజర్‌ను హతమార్చినట్లు తెలిసింది.
ఐఎన్‌టీయూసీ
నాయకుడిపై దాడి
ఇల్లెందు : పట్టణంలోని నంబర్–14 బస్తీకి చెందిన ఐఎన్‌టీయూసీ నాయకుడు కొండూరి చిన్నపై వలిపిరెడ్డి సందీప్ అనే ఆటో డ్రైవర్ దాడిచేసి గాయపర్చాడు. ఈ మేరకు చిన్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన తన ద్విచక్రవాహనంపై మిత్రుడి ఇంటికి వెళ్లి మాట్లాడుతుండగా.. రోడ్డుపై వాహనం ఆపావంటూ సందీప్ ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలో అతడి వద్దనున్న చాకును చిన్నపైకి విసరగా మెడ భాగంలో గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
గంజాయి చాక్లెట్లు స్వాధీనం
ఖమ్మంరూరల్: మండలంలోని ఆరెంపుల గ్రానైట్ ఫ్యాక్టరీ వద్ద కార్మికులకు అమ్ముతున్న 90 గంజాయి చాక్లెట్ల(517 గ్రాములు)ను పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. సాయిశ్రీ గ్రానైట్ ఫ్యాక్టరీ సమీపాన తిరుమలాయపాలెంకు చెందిన కొమ్ము ప్రభాకర్, యూపీకి చెందిన చోటాకం అక్కడి కార్మికులకు గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారనే సమాచారంతో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా చాక్లెట్లు స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు.