
దోభీ ఘాట్లు ఏమాయె..?
ఇల్లెందు : రజకులకు వృత్తిపరమైన తోడ్పానందించేందుకు తలపెట్టిన మోడ్రన్ దోభీ ఘాట్ నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలోని ఇల్లెందు, కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు మున్సిపాలిటీల్లో రూ. 8 కోట్లతో దోభీ ఘాట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అవసరమైన స్థలాలను కూడా ఎంపిక చేశారు. ఇల్లెందులో సింగరేణి సంస్థ 8 కుంటల భూమి కేటాయించడంతో నిర్మాణ పనులు ప్రారంభించారు. ఘాట్‌తోపాటు భవనంపై అంతస్తులో ఫంక్షన్ హాల్ నిర్మించాలని నిర్ణయించారు. పట్టణంలోని 86 కుటుంబాల రజకులు దోభీ ఘాట్‌ను ఉపయోగించుకునేందుకు సంఘంగా ఏర్పడ్డారు. భవన నిర్మాణం స్లాబ్ లెవెల్ వరకు పూర్తయ్యాక, కాంట్రాక్టర్ పనులు నిలిపివేశాడు. ఇక కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు పట్టణాల్లో పనులే ప్రారంభమే కాలేదు. దీంతో రజక వృత్తిదారులు నిరాశ చెందుతున్నారు.
అధికారుల నిర్లక్ష్యం..
భవనంలో ఒక షెడ్డు, 30 కిలోల కెపాసిటీ కలిగిన మూడు వాషింగ్ మిషన్లు, మూడు స్పిన్నర్లు, స్టీమ్ బాయిలర్, క్యాలెండర్ మిషన్, రెండు డయ్యర్లు, ఇసీ్త్ర చేసేందుకు మూడు ఐరన్ ఎలక్ట్రికల్ టేబుళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎనిమిది గంటల్లో టన్ను బరువు గల బట్టలను ఉతికే సామర్థ్యంతో డిజైన్ చేశారు. 500 చదరపు గజాల స్థలంలో భవనం, ఆధునిక యంత్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కానీ ఏళ్లు గడుస్తున్నా దోభీ ఘాట్ల నిర్మాణమే పూర్తికాలేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారని రజక వృత్తిదారులు ఆరోపిస్తున్నారు.
రూ.8 కోట్లతో నాలుగు
మున్సిపాలిటీల్లో మంజూరు
ఇల్లెందులో అసంపూర్తిగా
భవన నిర్మాణం
మిగిలిన మూడు చోట్లా
ప్రారంభంకాని పనులు