
రసాభాసగా కాంగ్రెస్ సమావేశం
పాల్వంచ: కాంగ్రెస్ పార్టీ జిల్లాస్థాయి ముఖ్యకార్యకర్తల సమావేశంలో రసాభాస నెలకొంది. సమావేశాన్ని అర్ధంతరంగా ముగించి, డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యేలు మాట్లాడకుండానే వెళ్లిపోయారు. బుధవారం వజ్రా హోటల్‌లో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల అంతర్గత సమావేశం నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు పొదెం వీరయ్య, టీపీసీసీ పరిశీలకులు శ్రావణ్ కుమార్ రెడ్డి, పి.ప్రమోద్, భద్రాచలం, పినపాక ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, జారే ఆదినారాయణ తదితరులు హాజరయ్యారు. టీపీసీసీ పరిశీలకులు మాట్లాడాక ముఖ్యనేతలు మాట్లాడుతుండగా కార్యకర్తలు అడ్డుకున్నారు. పార్టీకి సంబంధం లేని వ్యక్తులు, అధికారం రాగానే ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు పెత్తనం ఏంటని ప్రశ్నించారు. కష్టపడ్డ నాయకులకు ఎక్కడా చోటు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దమ్మగుడి పాలక మండలిలో స్థానికులు, కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వారికి చోటు ఇవ్వకుండా నాయకులే మోసం చేశారని గంధం నరసింహారావు అనే కార్యకర్త ఆరోపించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను బాయికాట్ చేస్తామని పేర్కొన్నారు. మరికొందరు సైతం మాట్లాడుతూ ఇతర పార్టీల వారికి కండువాలు కప్పడంతో, వారి పెత్తనం కింద పనిచేయాల్సి వస్తుందని గొడవకు దిగారు. దీంతో కొంత కాలంగా ఉన్న వర్గ విబేధాలు బహిర్గతమైనట్లయింది. కాగా సంయమనం పాటించాలని డీసీసీ అధ్యక్షుడు, పరిశీలకులు కోరారు. కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుంటామని చెప్పినా శ్రేణులు శాంతించకుండా అడ్డుకోవడంతో సమావేశాన్ని అర్ధంతరంగా ముగించి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు నాగ సీతారాములు, ధర్మారావు, భూక్యా దళ్‌సింగ్, జేబీ శౌరి, దేవీ ప్రసన్న, యడవల్లి కృష్ణ, కొత్వాల శ్రీనివాసరావు, నూకల రంగారావు, కార్తీక్, వై.ముత్తయ్య, జలీల్ పాల్గొన్నారు.