
సొసైటీ చైర్మన్, సీఈఓ నిర్బంధం
ఆ తర్వాత గన్నీ సంచులు తీసుకెళ్లిన రైతులు
వైరారూరల్: రోజుల తరబడి ధాన్యం ఆరబోసి వేచిచూస్తున్న రైతులకు గన్నీ సంచులు ఇవ్వకపోవడంతో సొసైటీ కార్యాలయంలో చైర్మన్, సీఈఓ సహా ఉద్యోగులను నిర్బంధించి నిరసన తెలిపారు. ఆతర్వాత కాసేపటికి వారిని వదిలేసి సంచులు తీసుకెల్లిన ఘటన వివరాలిలా ఉన్నాయి. వైరా మండలం గరికపాడు సొసైటీ కార్యాలయానికి పది వేల ఖాళీ గన్నీసంచులు రావడంతో పలువురు రైతులు తమకు ఇవ్వాలని కోరారు. అయితే, ఉన్నతాధికారుల ఆదేశాలు అందేవరకు ఎవరికీ ఇవ్వబోమని, ఇప్పటికే కాంటా వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాకే ఇస్తామని సిబ్బంది బుదలిచ్చారు. దీంతో రైతులు ఆగ్రహానికి గురై కార్యాలయంలో చైర్మన్ అయిలూరి కృష్ణారెడ్డి, సీఈఓ రామకృష్ణ, సిబ్బంది ఉండగానే షట్టర్ వేశారు. ఆ కాసేపటికే షట్టర్ తీసి.. ఖాళీ బ్యాగ్‌లు తీసుకెళ్లారు. సొసైటీ పరిధిలోని గ్రామాల్లో 12,328 బస్తాలు ఐదు రోజులుగా రోడ్ల వెంట, కల్లాల్లో ఉన్నాయి. ఇవన్నీ మిల్లులకు తరలించాకే రైతులకు గన్నీ బ్యాగ్‌లు ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలిసింది. కానీ రైతులు మాత్రం రోజుల తరబడి ధాన్యం ఆరబోసి ఎదురుచూస్తున్నందున బ్యాగ్‌ల్లో నింపి భద్రపర్చుకుంటామని తీసుకెళ్లారు. ఈ విషయంలో సొసైటీలో ఎవరిపైనానా చర్యలు తీసుకుంటే తాము బాధ్యత వహిస్తామని రైతులు నచ్చచెప్పడం గమనార్హం.