
నేటి నుంచి ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్రమహాసభలు
తొలిరోజు ప్రదర్శన, బహిరంగ సభ
ఖమ్మంమయూరిసెంటర్: విద్యా రంగ సమస్యలపై చర్చించి, పోరాట కార్యాచరణ రూపొందించేందుకు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఐదో మహాసభలు వేదికగా నిలవనున్నాయి. ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు జరిగే సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభా ప్రాంగణంతోపాటు నగరంలోని ప్రధాన కూడళ్లు, రహదారుల వెంట ఎర్రతోరణాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. 2002లో ఖమ్మంలో సంఘం రాష్ట్ర మహాసభలు జరగ్గా.. తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారి ఇప్పుడు నిర్వహిస్తున్నారు. సభల్లో భాగంగా తొలిరోజైన శుక్రవారం జెడ్పీ సెంటర్ నుంచి భక్తరామదాసు కళాక్షేత్రం వరకు భారీ ప్రదర్శన, ఆతర్వాత కళాక్షేత్రంలో బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. సభకు రాష్ట్ర నలుమూలల నుంచి 500మంది ప్రతినిధులతో పాటు జిల్లా నాయకులు పాల్గొననున్నారు. కాగా, సభలో ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షుడు వీ.పీ.సాను ప్రసంగించనుండగా.. సినీ నటుడు మాదాల రవి, ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ ఉపాధ్యక్షుడు నితీష్ నారాయణ్, ఎమ్మెల్సీ, ప్రజా వాగ్గేయకారుడు గోరెటి వెంకన్న పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.