సింగరేణి యాజమాన్యమే
చేయించిందని బాధితుడి ఆరోపణ
కొత్తగూడెంటౌన్: ఆరుబయట పార్క్ చేసిన రెండు కార్లను గుర్తుతెలియని దుండగులు దహనం చేసిన ఘటన మంగళవారం తెల్లవారుజామున రామవరం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితుడు జీకే సంపత్‌కుమార్, పోలీసుల కథనం ప్రకారం.. రామవరం సుభాష్‌చంద్రభోస్‌నగర్ కాలనీలో పార్క్ చేసిన సంపత్‌కుమార్ కారుకు తెల్లవారుజామున గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు నిప్పు పెట్టారు. మంటలు పక్కనే ఉన్న వీరుకు చెందిన కారుకు అంటుకున్నాయి. చుట్టుపక్కల పొగ వ్యాపించడంతో సంపత్‌కుమార్ అక్కడికి చేరుకుని మంటలు ఆర్పేందుకు యత్నించాడు. పోలీసులు, ఆగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకునేలోగానే రెండు కార్లు పూర్తిగాకాపోయాయి. టూటౌన్ సీఐ రమేశ్‌కుమార్, క్లూస్ టీం వివరాలు సేకరించారు. సీసీ కెమెరా పరిశీలించగా ఆగంతకులు తచ్చాడుతున్నట్లు కనిపించిందని, చీకటి ఉండటంతో స్పష్టంగా కనిపించలేదని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.4 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిఆపరు. జీకే సంపత్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ పోలీసులు తెలిపారు. కాగా, సంపత్‌కుమార్ మాట్లాడుతూ.. గతంలో తాను సింగరేణి సంస్థపై కేసు వేశానని, తనను భయపెట్టేందుకే సింగరేణి యాజమాన్యం ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు ఆరోపించారు. కేసు విషయంలో బుధవారం హైదరాబాద్‌కు వెళ్లాల్సి ఉందని తెలిపారు.