కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ స్వరూపం
ప్రాంతం జనాభా వైశాల్యం
కొత్తగూడెం 97,337 15.87 చ.కి.మీ
పాల్వంచ 89,721 40.87 చ.కి.మీ
సుజాతనగర్ 11,124 28.48 చ.కి.మీ
మొత్తం 1,98,182 85.22 చ.కి.మీ
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: పాల్వంచ – కొత్తగూడెం మున్సిపాలిటీలు, సుజాతనగర్ మండలంలోని ఏడు గ్రామపంచాయతీలను ఏకం చేస్తూ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించిన బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందింది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఈనెల 18న కొత్తగూడెం కార్పొరేషన్ బిల్లును సభలో ప్రవేశపెట్టగా.. సోమవారం చర్చను ప్రారంభించారు. ఓటింగ్‌లో మెజారిటీ సభ్యుల సమ్మతితో బిల్లు ఆమోదం పొందినట్లు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రకటించారు. ఈ బిల్లుపై గవర్నర్ సంతకం చేయగానే చట్టంగా మారుతుంది. ఆ వెంటనే ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. అప్పటి నుంచి కొత్తగూడెం – పాల్వంచ – సుజాతనగర్ (ఏడు గ్రామ పంచాయతీలు)తో కూడిన కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ అమల్లోకి వస్తుంది. ఇప్పటికే ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో నగరాభివృద్ధి పద్దు కింద కొత్తగూడెం కార్పొరేషన్‌కు ప్రత్యేకంగా నిధులు కేటాయించిన విషయం విదితమే.
ఎన్‌ఎండీసీపై దృష్టి పెట్టాలి..
పాల్వంచలో ఎన్‌ఎండీసీకి చెందిన 500 ఎకరాల స్థలాన్ని వినియోగంలోకి తేవాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. జీరో అవర్ సందర్భంగా జిల్లాకు సంబంధించిన కీలక అంశాలను ఆయన సభలో ప్రస్తావించారు. స్పాంజ్ ఐరన్ పరిశ్రమకు ఒకప్పుడు ఆసియా ఖండంలోనే ప్రత్యేక గుర్తింపు ఉండేదని, ఈ పరిశ్రమ మూతపడిన తర్వాత ఈ స్థలం ఎన్‌ఎండీసీ పరిధిలో నిరుపయోగంగా ఉందని కూనంనేని తెలిపారు. దీన్ని ఉపయోగంలోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని, బయ్యారం ఉక్కు పరిశ్రమపై కూడా నిర్ణయం తీసుకోవాలని కోరారు.
చర్చకొచ్చిన షెడ్యూల్ సమస్యలు..
షెడ్యూల్ ఏరియాల్లో గౌడలు పెద్ద సంఖ్యలో ఉన్నారని, అయితే కల్లు గీసే విషయంలో వారికి ఎలాంటి హక్కులు లేవని, స్థానిక సర్దుబాటుతోనే గీత కార్మికులు పని చేస్తున్నారని కూనంనేని అసెంబ్లీ దృష్టికి తెచ్చారు. ఈ క్రమంలో ప్రమాదాలు జరిగినప్పుడు గీత కార్మికులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదన్నారు. షెడ్యూల్ ఏరియాలో గీత కార్మికులను ఆదుకునే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించాలని అన్నారు. దీంతో పాటు సింగరేణి ప్రాంతాల్లో క్రమబద్ధీకరణకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకొచ్చిన జీఓ 76ను వేగంగా అమలు చేస్తే ప్రజలకు, ప్రభుత్వానికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అంబ సత్రం భూములను సాగు చేస్తున్న రైతులకు పట్టాలు లేక రైతు భరోసా పొందలేకపోతున్నారని తెలిపారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో విలీనమయ్యే గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఉపాధి హామీ పథకం వర్తించేలా చూడాలని కోరారు.
అసెంబ్లీలో
ఆమోదం పొందిన బిల్లు
ఎన్‌ఎండీసీ, బయ్యారం ఉక్కు,
జీవో 76పైనా చర్చ
షెడ్యూల్ ఏరియా సమస్యల ప్రస్తావన
బడ్జెట్ సమావేశాల్లో ‘భద్రాద్రి’ సంగతులు
అందరికీ ధన్యవాదాలు
కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సలహా ఇచ్చిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు సహకరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు. మున్సిపల్ అధికారులు దానకిశోర్, శ్రీదేవి, గౌతమ్, జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్‌కు ధన్యవాదాలు. కొత్తగూడెం ప్రజల తరఫున సీఎం రేవంత్‌రెడ్డికి స్పెషల్ థ్యాంక్స్. కార్పొరేషన్ ఏర్పాటు నిర్ణయంతో పాతికేళ్ల తర్వాత పాల్వంచలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయి.
–కూనంనేని సాంబశివరావు, కొత్తగూడెం ఎమ్మెల్యే
ఎట్టకేలకు కార్పొరేషన్ !